హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ స్తంభింపజేసిన ఆయన ఆస్తులను విడుదల చేయరాదంటూ సీబీఐ శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. జగతి పబ్లికేషన్స్, ఇందిర టెలివిజన్ కరెంట్ ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన అస్తులను సీబీఐ కోర్టులో కేసులు తేలేదాకా విడుదల చేయరాదని కోరింది. కరెంట్ ఖాతాల నిర్వహణలో భాగంగా 2012లో ఇదే కోర్టు ఆదేశాలతో..
హామీగా సమర్పించిన మూడు స్థిరాస్తులను విడుదల చేయాలంటూ జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా, ఇందిర టెలివిజన్లు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ జే శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ జగన్ కేసు దర్యాప్తు సందర్భంగా జగతికి చెందిన సుమారు రూ.46.82 లక్షలున్న కరెంట్ ఖాతాలను స్తంభింపజేశామని తెలిపారు. అయితే మీడియా నిర్వహణ, ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుని షరతులతో హైకోర్టు అనుమతించిందని తెలిపారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.