హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): హైడ్రాను చూపి ప్రైవేట్ భూముల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారంటూ ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ప్రచురితమైన ‘మినిస్టర్ 30 పర్సెంట్’ కథనం సంచలనం సృష్టించింది. ఇదేరోజు హైడ్రా తీరుపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓఆర్ఆర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు, కొన్నిచోట్ల భూముల స్వాధీనం విషయంలో జరిగిన తంతులో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉన్నదంటూ పలువురు బాధితులు చెప్పుకొంటున్నారు. తమ విషయం బయటకొస్తే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలో? అంటూ వారు భయాందోళన వ్యక్తంచేశారు. ముఖ్యంగా ఉస్మాన్‌సాగర్ వద్ద ఒక భూమికి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రంలోని ఒక మంత్రి చెబితే అక్కడకు వెళ్లిన హైడ్రా.. మళ్లీ వెనక్కి తిరిగొచ్చిందని, దీనిపై ఒక వ్యవహారం కూడా నడిపించినట్టుగా తెలిసింది. అంతేగాకుండా కొన్ని భూముల విషయంలో తాము పట్టుబట్టి ముందుకుపోయినా వదిలేయాలని అధికార పార్టీ ముఖ్యనేతల నుంచి అది కూడా మినిస్టర్ 2, మరో ఇద్దరు కీలక మంత్రుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అక్కడి నుంచి హైడ్రా బృందాలు బయటకు వెళ్లిపోతాయని, లేకపోతే అక్కడే మకాం వేసి అన్నీ పూర్తయ్యేవరకు కదలడం లేదని బాధితులు చెప్పుకొంటున్నారు.
హైడ్రా ద్వంద్వ వైఖరి
కూకట్‌పల్లిలోని సర్వేనంబర్లు 1,003 నుంచి 1,006 వరకు ఉన్న 13.17 ఎకరాల ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ భూమి విషయంలో హైడ్రా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నది. ఒకసారి తాము ఈ భూమిలో జోక్యం చేసుకోబోమని చెప్తూనే, అంతకుముందే తాము అప్పీల్‌కు వెళ్లామని ఇప్పుడు ప్రకటిస్తున్నది. జూన్ 4న జరిగిన విచారణలో హైడ్రా కౌన్సిల్ తరఫు న్యాయవాది తాము ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోబోమని హైకోర్టులో రాతపూర్వకంగా ప్రకటించారు. కానీ ఈదులకుంటపై ‘నమస్తే’ కథనం వచ్చిన తర్వాత తాము జూన్ 2వ తేదీనే అప్పీల్‌కు వెళ్లామని, అందులో వచ్చిన తీర్పు అనుకూలంగా లేనందున తాము డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లబోతున్నట్టు హైడ్రా ప్రకటించింది. ఇదే సమయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు గతనెల 30న లేఖ రాశామని, ఆ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని ప్రకటించింది. అదేరోజు హైడ్రా అప్పీల్ వేస్తామని చెప్పి ఆ తర్వాత 4వ తేదీన జరిగిన విచారణలో తాము ఈభూమి జోలికి వెళ్లబోమని చెప్పింది. మరి తాము అప్పీల్‌కు 2వ తేదీనే వెళ్తే ఎందుకు హైకోర్టులో ఈ విషయాన్ని ప్రస్తావించలేదనే ప్రశ్న తలెత్తుతున్నది. ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన ‘మినిస్టర్ 30 పర్సెంట్’ కథనంతో హైడ్రా తన అప్పీల్ విషయంతోపాటు ఈదులకుంటపై తాము రాసిన లేఖను బయటపెట్టింది. ఇంతవరకు కలెక్టర్ నుంచి నివేదిక కోరడంలో హైడ్రా ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు. వచ్చే నెల 6వ తేదీన హైకోర్టుకు హైడ్రా తన నివేదిక సమర్పించాల్సి ఉండగా, ఇప్పటివరకు ఈ విషయంపై ఎందుకు ముందుకు పోవడం లేదనేది వెయ్యి డాలర్ల ప్రశ్న.
రెవెన్యూ, ఇరిగేషన్ అఫిడవిట్లో లేని నీటివనరు
ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా కేటాయించిన ఈ భూమిలో ఈదులకుంట ఉంటే ఇది శిఖం పట్టా అని చూపాలి. కూకట్పల్లి గ్రామంలోని సర్వేనంబర్లు 1,003 నుంచి 1,006 వరకు ఉన్న భూమి విషయంలో ప్రభుత్వం అలా చెప్పలేదు. ఈ విషయంలో జరిగిన కోర్టు వివాదాల్లో కూడా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఇదే ప్రభుత్వ హయాంలోనే అంటే 2024 ఆగస్ట్‌లో హైకోర్టుకు సమర్పించిన తమ అఫిడవిట్లో అక్కడ ఎలాంటి నీటివనరు లేదని పేర్కొన్నాయి. అంతేగాకుండా ఓవర్‌ల్యాప్ లేదంటూ ఏడీసర్వే తేల్చింది. ఇప్పుడేమో మళ్లీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాము జిల్లా కలెక్టర్ నుంచి రావాల్సిన నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, ఆ తర్వాత అప్పీల్‌కు వెళ్తామని చెప్తున్నారు. హైకోర్టులో రెవెన్యూశాఖ స్వయంగా నీటివనరే లేదని అఫిడవిట్ ఇచ్చిన తర్వాత మళ్లీ అదే రెవెన్యూ శాఖకు చెందిన కలెక్టర్ నీటివనరు ఉన్నదని చెప్తారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతున్నది. లేక్స్ కమిటీ చైర్మన్‌గా ఉన్న హైడ్రా కమిషనర్‌కు కూకట్‌పల్లిలో ఈదులకుంట నోటిఫై కాలేదనే విషయం తెలియదా? మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్న ఈదులకుంటను హెచ్ఎండీఏ ఎందుకు గుర్తించలేదు. ఇప్పటివరకు ఎందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇవ్వలేదు సరికదా కనీసం హెచ్ఎండీఏ చెరువుల జాబితాలో ఈ కుంటకు సంబంధించిన సమాచారమే లేకపోవడంపై కమిషనర్ ఏమని సమాధానం చెప్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘మినిస్టర్ 30 పర్సెంట్’ అంటూ వచ్చిన కథనంలో ప్రధాన సూత్రధారి అయిన మినిస్టర్ వ్యవహారంపై అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు హైడ్రా నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తున్నది. ముఖ్యంగా ఈ విషయంలో ప్రతిపక్షాలతోపాటు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు హైడ్రా చర్యలను, ప్రభుత్వ తీరును తప్పుబడుతూ పోస్టులు పెడుతూ వ్యాఖ్యలు చేస్తున్నా.. మంత్రి విషయంలో కానీ, కమీషన్ వ్యవహారంలో కానీ ప్రభుత్వం తరఫున, హైడ్రా నుంచి ఉలుకూపలుకూ లేదు.
కోర్టు సమయం కూడా వృథా చేస్తారా?
కోర్టు వివాదాలున్న భూముల జోలికి వెళ్లి మరోసారి కేసులు పెరిగేలాగా హైడ్రా పరిస్థితిని తీసుకొస్తున్నదంటూ నగరవాసులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా దీంతో అటు ప్రజలు, ఇటు కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హైడ్రా కమిషనర్ తనపై, సంస్థపై వందలకొద్దీ కేసులున్నాయంటూ చెప్పుకోవడం వెనక ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. సహజంగా హైడ్రా కూల్చివేత బాధితులు కోర్టుకు వెళ్తున్నప్పటికీ, కోర్టు వివాదాలు ఉన్న భూములైతే మరోసారి కోర్టులో ఇంకో కేసు వేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దీంతో ఈ కేసుల్లో వాదనలు పెరుగుతూ తుదితీర్పు రావడానికి జాప్యం జరుగుతున్నదని కొందరు ప్రభుత్వశాఖల అధికారులు కూడా అంతర్గతంగా చెప్పుకొంటున్నారు. తాజాగా ఈదులకుంట వ్యవహారంలో ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు తమదే అని చెప్తున్న భూమిపైకి వచ్చి మరోసారి వివాదాన్ని మరింత జఠిలం చేయడం ద్వారా కోర్టు సమయాన్ని వృథా చేయడమేనని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టుకు చెప్పిన హైడ్రా.. మరోసారి అప్పీల్‌కు వెళ్లడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కోర్టుకు అప్పీల్‌కు వెళ్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్
గ్రామ, రెవెన్యూ రికార్డులు, విలేజ్, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, శాటిలైట్ చిత్రాలు ఇలా అనేక ఆధారాలను పరిశీలించాకే ఈదులకుంట చెరువును పరిరక్షించడానికి తాము చర్యలు తీసుకున్నట్టు హైడ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘నమస్తే తెలంగాణ’లో కథనం వచ్చిన తర్వాత హైడ్రా విడుదల చేసింది. అంతకుముందు కమిషనర్ రంగనాథ్ ‘నమస్తే తెలంగాణ’ ఈ కథనంపై వివరణ ఇస్తూ.. తాము త్వరలో అప్పీలు దాఖలు చేస్తామని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఈ నెల 2న తాము హైకోర్టులో అప్పీల్ (కేసు నంబర్ ఎల్పీఏ ఎస్ఆర్ 254141/2026)ను దాఖలు చేశామని, ఆ ఎల్పీఏ కేసులో జారీచేసిన ఉత్తర్వు రాష్ట్రంలోని అనేక సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేసిన ఒక సాధారణ ఉత్తర్వు అయినందున తాము డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిస్తున్నామని రంగనాథ్ తెలిపారు. హైడ్రా ద్వారా సరస్సు అభివృద్ధికి సంబంధించి కలెక్టర్ నుంచి వ్యాఖ్యలు కోరామని చెప్పారు.
హైడ్రా ప్రకటనలో ఇలా..
తమ్మిడికుంట నుంచి ఈదులకుంటకు వరద కాలువలున్నాయని, ఈదులకుంట నుంచి సున్నంచెరువుకు వెళ్లే ఔట్లెట్లు కూడా స్పష్టంగా ఉన్నాయని, ఇవన్నీ ఈదులకుంట చెరువును రుజువు చేస్తున్నాయని హైడ్రా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. ఖానామెట్ గ్రామంలోని సర్వే నంబర్ 7లో 6.05 ఎకరాల ఈదులకుంట ఉన్నట్టు రికార్డులన్నీ చెప్తున్నాయని, ఈ విషయాన్ని నిర్ధారించుకొనేందుకు హైడ్రా పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించిందని తెలిపింది.
ఖానామెట్ గ్రామంలోని సర్వేనంబర్ 11/37/ఏలో 5.06 ఎకరాల ప్రభుత్వభూమిని కూడా కాపాడాలని, ఇందుకు అవసరమైన మెన్ అండ్ మెషినరీని సమకూర్చాలని రెవెన్యూ అధికారులు మే 25, 26 తేదీల్లో హైడ్రాకు లేఖలు రాశారని, ఈ మేరకు మే 26వ తేదీన హైడ్రా ఫెన్సింగ్ వేసినట్టు పేర్కొన్నది. ఖానామెట్‌లో ఈ రెండు విషయాల్లో మేనెల 29న ఇంటర్మ్ ఆర్డర్‌ను హైకోర్టు జారీచేయగా, ఈనెల 2న హైడ్రా హైకోర్టును ఆశ్రయించి వాస్తవాలు వెల్లడించామని కోరింది. ఇదే కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు గత నెల 30న లేఖ రాసినట్టు హైడ్రా పేర్కొన్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి గ్రామంలోని సర్వేనంబర్ 1,003 నుంచి 1,006లో ఉన్న 13.17 ఎకరాల భూమిగా కోర్టుకు చెబుతూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని ఖానామెట్ గ్రామ సర్వేనంబర్ 7లోని 6.05ఎకరాల ఈదులకుంటలోకి వచ్చినట్టు వెల్లడవుతున్నదని, రికార్డుల ప్రకారం ఈదులకుంట వివరాలను అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఈ వివరాలు కోర్టుకు అందిస్తామని హైడ్రా తెలిపింది.