పోచమ్మమైదాన్, మే 5: వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఏసీలకు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘దవాఖానల్లో పనిచేయని ఏసీలు’ శీర్షికన ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. డీఎంఈతోపాటు మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ ఆదేశాలకు మేరకు పీడియాట్రిక్ యూనిట్ ఐసీయూ/హెచ్డీయూ వార్డుల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ఎంజీఎంతోపాటు మార్చురీ గదిలో కూడా ఏసీలకు మరమ్మతులు చేశారు. దవాఖానలో పిల్లలకు ఇబ్బందులు కలుగకుండా ఏసీలను రిపేర్ చేయిస్తున్నట్టు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మార్చురీలోని ఫ్రీజర్ల మరమ్మతుతోపాటు ఆవరణ మొత్తం పరిశుభ్రం చేయించినట్టు ఆయన వివరించారు. ఇక్కడ రోగుల కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని సూపరింటెండెంట్ చెప్పారు.