హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా ఉండాల్సిన సచివాలయం.. కాంగ్రెస్ పాలనలో ధర్నాచౌక్లా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ రెండు రోజుల క్రితం చిన్న కాంట్రాక్టర్లు సచివాలయం లోపల ధర్నా చేయగా, తాజాగా ప్రభుత్వ అద్దె వాహన యజమానులు సచివాలయం ఎదుట ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ, అసమర్థ పాలనకు ఇది నిలువెత్తు నిదర్శనం కాదా? అని మంగళవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, చిన్న కాంట్రాక్టర్లు, చిరు ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులతోపాటు జీతాలను కూడా పెండింగ్ పెట్టడం శోచనీయమమని పేర్కొన్నారు. వాహనాల అద్దె బిల్లులు హైదరాబాద్‌లో 10 నెలలుగా, జిల్లాలో రెండేండ్లుగా పెండింగ్‌లో పెట్టడం తీవ్ర అన్యాయం అని మండిపడ్డారు. కమీషన్లు ఇవ్వడంలేదనే అద్దె వాహనాల బిల్లులు చెల్లించడం లేదా? అని నిలదీశారు. అద్దె వాహన యజమానుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.