Hydraa | హైదరాబాద్ సిటీబ్యూరో/మణికొండ/శంషాబాద్ రూరల్, మే 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగర శివార్లలో అనుమతి లేకుండా నడుస్తున్న స్టోన్ క్రషింగ్ యూనిట్లు, రెడీమిక్స్ (ఆర్ఎంసీ) ప్లాంట్లను హైడ్రా మంగళవారం నేలమట్టం చేసింది. ఇందులో ఇటీవల వివాదాస్పదమైన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు మరికొన్ని కంపెనీలు ఉన్నాయని తెలుపుతూ తొలుత ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కొత్వాల్‌గూడలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ను తొలగించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకంతో వెలువడిన ప్రకటనలో పేర్కొంది. ఆ తరువాత కొద్దిసేపటికే రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరును తొలగించి మరో కంపెనీ పేరును చేరుస్తూ మరో ప్రకటన విడుదల చేసింది. అనుమతి లేకుండా నడుస్తూ పలు అక్రమాలకు పాల్పడిన రాఘవ కన్స్ట్రక్షన్స్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన సంస్థ అని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే. హైడ్రా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ.. మంత్రికి చెందిన సంస్థను నేలమట్టం చేశామన్న వార్త ప్రజల్లోకి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే పత్రికా ప్రకటనను మార్చి విడుదల చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తొలుత ఆరు ప్రదేశాల్లో స్టోన్ క్రషింగ్ యూనిట్లను తొలగించామని తెలిపిన హైడ్రా రెండో ప్రకటనలో ఆ సంఖ్యను నాలుగుకు తగ్గించింది.
గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండలం గౌలిదొడ్డి, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో అనుమతిలేని క్రషింగ్ యూనిట్లపై హైడ్రా చర్యలు తీసుకుంది. వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఎనిమిది క్రషింగ్ యూనిట్లతోపాటు 13 ఆర్ఎంసీ ప్లాంట్లలో మూడింటిని నేలమట్టం చేసింది. మరో పది ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించాల్సి ఉందని ఒక ప్రకటనలో హైడ్రా పేర్కొంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ శాఖల ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.
మెన్ అండ్ మెషినరీ కావాలని పీసీబీ, మైనింగ్, రెవెన్యూ అధికారులు కోరడంతో హైడ్రా ఈ ఆపరేషన్‌ను చేపట్టిందని, ఆయా శాఖల అధికారుల సమక్షంలోనే గౌలిదొడ్డి, వట్టినాగులపల్లి, గోపన్నపల్లి, కొత్వాల్‌గూడలో ఏండ్లుగా నడుస్తున్న క్రషింగ్ యూనిట్లను తొలగించినట్టు హైడ్రా అధికారులు తెలిపారు. బినామీ పేర్లతో బడాసంస్థల అండదండలు, బడాబాబులు వెనుకుండి నడిపిన యూనిట్లు నేలమట్టమయ్యాయని, ఇం దులో ఏ ఒక్క క్రషింగ్ యూనిట్‌కు మైనింగ్, పీసీబీ అనుమతులు లేవని వెల్లడించారు. పీసీబీ నోటీసులు, రెవెన్యూ శాఖ ఆదేశాలు, మైనింగ్ అభ్యంతరాలు పట్టించుకోకుండా నడుస్తున్న యూనిట్లు హైడ్రా చర్యలతో నేలమట్టమయ్యాయని ఆ ప్రకటనలో తెలిపారు.
కొండలు, గుట్టలను ఎలాంటి అనుమతి లేకుండా ధ్వంసం చేస్తున్నారని, రాత్రీపగలూ అనే తేడా లేకుండా క్రషింగ్ చేసి వాయుకాలుష్యానికి కారణమవుతున్నాయని తెలుపుతూ పీసీబీ, రెవెన్యూ, మైనింగ్ శాఖలు హైడ్రాకు ఫిర్యాదు చేశాయని తెలిపారు. ఇదంతా ఓఆర్ఆర్ పరిధిలోనే జరుగుతున్నదని, అక్రమంగా నడుస్తున్న క్రషింగ్ యూనిట్లతోపాటు వర్కింగ్ లైసెన్సు లేని ఆర్ఎంసీ యూనిట్లను కూడా తొలగించామని హైడ్రా తెలిపింది. భవిష్యత్తులో అక్కడ అక్రమ స్టోన్ క్రషింగ్ చేయడానికి వీలులేకుండా పరికరాలను కూడా నేలమట్టం చేసింది.
భగత్‌సింగ్ స్టోన్ క్రషర్, ఎస్వీకే, పరమేశ్వర్స్టోన్, పృథ్వి, గ్రేట్ ఇండియా మైనింగ్, ఆర్ మిల్లర్, తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందిన క్రషింగ్ యూనిట్లతోపాటు బీఎస్ఆర్, అల్ట్రాటెక్, ఏసీపీ రెడీమిక్స్ ప్లాంట్లు ఇందులో ఉన్నాయని పేర్కొన్నది. ఈ ప్లాంట్లు ఎవరివి అంటే సరైనా చిరునామా లేకుండా సాగిపోతున్నాయని, ఎన్ని ఎకరాలు లీజుకు తీసుకున్నదీ వివరాలు లేవని, రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో దా దాపు 16 ఎకరాల మేర విస్తరించి అందులో 7ఎకరాల వరకూ కొండల్ని పిండి చేసినట్టు ఆనవాలు కనిపించాయని హైడ్రా తెలిపింది. తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందిన క్రషింగ్ యూనిట్ ఇక్కడ నడుస్తుండగా దానిని మొ త్తం తొలగించామని, ఇక్కడే మరో రెండు ఆర్ఎంసీ ప్లాంట్లను కూడా నేలమట్టం చేశామని పేర్కొన్నది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండంలోని గౌలిదొడ్డి గ్రామం, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడినవారంతా బడా సంస్థలకు చెందినవారేనని హైడ్రా తెలిపింది. అక్రమ మైనింగ్ జరుగుతున్న యూనిట్లను కూల్చివేయాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైడ్రాకు విజ్ఞప్తి చేశారని, ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న యూనిట్లను తొలగించాలని కోరారని పేర్కొన్నది. గౌలిదొడ్డిలో గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టినాగులపల్లిలోని మూడుచోట్ల పరమేశ్సింగ్ స్టోన్ క్రషర్/శ్రీలక్ష్మికన్స్ట్రక్షన్స్, పృథ్వీస్టోన్ క్రషర్, కొత్వాల్‌గూడలోని రాఘవ స్టోన్‌క్రషర్ సంస్థలు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాయని తెలుపుతూ ఈ సంస్థలకు తోడు మక్తా భగత్‌సింగ్ అనే వ్యక్తి స్టోన్ క్రషింగ్‌ను పెద్ద ఎత్తున చేపట్టారని హైడ్రా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మైనింగ్, పీసీబీ అనుమతులు లేకుండా యూనిట్లు నడుపడంతో రంగారెడ్డి కలెక్టర్ లేఖతో చర్యలు తీసుకున్నామని, కాలుష్యకారక యూనిట్ల తొలగింపుతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. హైడ్రా తన ప్రెస్‌నోట్‌ను ఉదయం 9.20 గంటలకు అధికారిక వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయగా, తర్వాత కొద్దిసేపటికి అంటే మధ్యాహ్నం 12.06 గంటలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొత్వాల్‌గూడలో తాము కూల్చేసిన అక్రమ క్రషర్ యూనిట్ తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందిందని ఇది తమ ద్వారా జరిగిన సమాచారలోపమంటూ అదే గ్రూపులో రాఘవ కన్స్ట్రక్షన్స్ వారు మైనింగ్ శాఖకు రాసిన లేఖను జతపరుస్తూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత సాయంత్రం మరో ప్రెస్‌నోట్‌ను అధికారికంగా హైడ్రా విడుదల చేయడం గమనార్హం.