Minister Sridhar Babu | గీసుగొండ, డిసెంబర్ 7 : ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మిగిలిన హామీలను రెండేండ్లలో అమలుచేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శనివారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట కాకతీయ మెగా టెక్సటైల్ పార్కును శనివారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట హరిహర ఎస్టేట్‌లో రూ.50 లక్షలతో నిర్మించిన విశ్వబ్రాహ్మణ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫ్రీ బస్సు కోసం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీకి రూ.120 కోట్లు చెల్లిస్తున్నారని చెప్పారు.
దీంతో అక్కడున్న మహిళలు.. ‘ఆటో వాళ్లు సచ్చిపోతున్నారు సారు’ అంటూ ప్రసంగానికి అడ్డుతగిలారు. ‘మీరు వద్దంటే ఫ్రీ బస్సు పక్కన పెడ్తామని మంత్రి చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తున్నము, ఆ పైసలు ప్రభుత్వమే చెల్లిస్తున్నది’ అని అన్నప్పుడు మహిళలు జోక్యం చేసుకొని ‘మా ఒక్కరికే ఇస్తలేరు.. అందరికీ వస్తున్నది’ అంటూ మరోసారి చెప్పడంతో ‘అమ్మా మీరు అట్లా మాట్లాడితే కుదరదు’ అని మంత్రి ఆవేశానికి లోనయ్యారు. స్థానిక నాయకులు మహిళలను సముదాయించడంతో మంత్రి ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు ఉన్నారు.