Govt Engineering Colleges | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదవాలని విద్యార్థులు తహతహలాడుతారు. సీటు వస్తే చాలు ఎగిరిగంతెస్తారు. కానీ ఏటా అలాంటి సర్కారు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్లు మిగులుతున్నాయి. 2020-21 విద్యాసంవత్సరంలో 17 శాతం మిగలగా, 2023-24కు వచ్చేసరికి ఏకంగా 33శాతం సీట్లు మిగిలాయి. 2023-24 విద్యాసంవత్సరంలో ఆయా కాలేజీల్లో 67శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో 19 ప్రభుత్వ, 155 ప్రైవేట్ కాలేజీలున్నాయి.
ప్రతిభావంతులంతా ఐఐటీలు, ఎన్ఐటీల్లో చేరడంతో సర్కారు కాలేజీల్లోని సీట్లు ఖాళీగా ఉండేవి. దీంతో ఇప్పుడు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల భర్తీ అయిన తర్వాతే ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయినా అత్యంత ప్రధానమైన ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు నిండటంలేదు.
రాష్ట్రంలో 18 యూనివర్సిటీ కాలేజీలుండగా 5,907 సీట్లకు 5,014 సీట్లు భర్తీకాగా 893 ఖాళీగా ఉన్నాయి. 2 ప్రైవేట్ వర్సిటీల్లో 98.91 సీట్లు భర్తీకాగా, 154 ప్రైవేట్ కాలేజీల్లో 94.88 శాతం భర్తీ అయ్యాయి. 87 కాలేజీల్లో వందశాతం సీట్లు భర్తీకాగా, వీటిలో 80 ప్రైవేట్ కాలేజీలే ఉన్నాయి. ఏడు మాత్రమే యూనివర్సిటీ కాలేజీలున్నాయి.