హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఇన్‌సర్వీస్ వైద్యులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇతర ప్రాంతాల్లో ఎంబీబీఎస్ చదివిన తెలంగాణ స్థానికత గల ఇన్‌సర్వీస్ వైద్యులకు పీజీ చేయడానికి లైన్‌క్లియర్ అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టికల్ 371డీ, జీవో 16ప్రకారం స్థానికంగా చదివిన ఇన్‌సర్వీస్ వైద్యులకు ఉన్నత విద్యలో లోకల్ కింద 85శాతం రిజర్వేషన్, ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి అన్‌రిజర్వుడ్ కింద 15శాతం అడ్మిషన్లకు అవకాశం కల్పించేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అవే నిబంధనలు కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ నిబంధనలను ఎత్తేసింది. దీంతో తెలంగాణ స్థానికత కలిగినప్పటికీ ఇతర ప్రాంతాల్లో ఎంబీబీఎస్ చదివిన ఇన్‌సర్వీస్ వైద్యులకు పీజీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీనిపై వైద్యులు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కకపోవడంతో సు ప్రీంకోర్టు మెట్లెక్కారు. ఈ మేరకు వి చారించిన అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ స్థానికత కలిగి, ఇతర ప్రాంతాల్లో ఎంబీబీఎస్ చేసిన ఇన్‌సర్వీస్ వైద్యులకు పీజీ వైద్యవిద్య అడ్మిషన్లలో అవకాశం కల్పించాలని బుధవారం తీర్పు చెప్పింది