హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసభర్వాల్‌పై ఏవిధమైన చర్యలూ తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కమిషన్ ఏకపక్షంగా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో తనకు వ్యతిరేకంగా అభియోగాలు ఉన్నాయని, వీటి అమలును నిలిపివేయకపోతే తనకు ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా సర్వీస్‌కు కూడా నష్టం వాటిల్లుతుందంటూ స్మితాసభర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు జరిగిన విచారణలో సభర్వాల్ తరఫు సీనియర్ న్యాయవాది జే రామచందర్‌రావు వాదనలు వినిపించారు.
కమిషన్ నివేదికలో నిర్దిష్టంగా పిటిషనర్‌పై అభియోగాలు ఉన్నాయని తెలిపారు. పిటిషనర్ ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించారని, ఎప్పటికప్పుడు నాటి సీఎంకు నివేదికలు ఇచ్చారని, అయితే ఫైళ్లను మంత్రివర్గం ముందుంచలేదు కాబట్టి సభర్వాల్‌పై చర్యలకు ఆసారం ఉందని నివేదికలో పేరొనడం ఏకపక్షమని చెప్పారు. జస్టిస్ ఘోష్ పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎవరైనా చేసిన ఆరోపణలపై తుది నిర్ణయానికి వచ్చే ముందు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్‌లోని సెక్షన్ 8బీ, 8బీ సెక్షన్ల ప్రకారం ఆమెకు నోటీసులు జారీచేయాలనే నిబంధనను అమలు చేయలేదని తెలిపారు. తనకు వాదనలు వినిపించుకునే అవకాశం లేకుండానే ఏకపక్షంగా సమర్పించిన నివేదిక అమలును నిలిపివేయకపోతే పిటిషనర్ కెరీర్‌కు నష్టం జరుగుతుందని అన్నారు.
సీఎం వద్ద అదనపు కార్యదర్శిగా చేసేప్పుడు పిటిషనర్ నిర్లక్ష్యంగా, బాధ్యతరాహిత్యంగా విధులు నిర్వహించారని, చర్యలకు అర్హురాలని కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఉన్నదని తెలిపారు. ఇవి చాలా తీవ్రమైన అభియోగాలని, వీటి అమలును తక్షణమే నిలిపివేయాలని, పిటిషనర్‌పై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే రిటైర్డు ఐఏఎస్ అధికారి జోషీకి వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. వాదనల తరువాత డివిజన్ బెంచ్.. ఘోష్ కమిషన్ నివేదికలో పిటిషనర్ సభర్వాల్‌పై నిర్దిష్టంగా చేసిన అభియోగాల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణను కేసీఆర్, హరీశ్ రావుల పిటిషన్లతోపాటు వచ్చే నెల 7న విచారణ జరుపుతామని ప్రకటించింది.