TG Highcourt | రంగారెడ్డి, జనవరి 10 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని ఫార్మా అనుబంధ గ్రామాల్లో రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ఫార్మా అనుబంధ గ్రామాల్లో ఎలాంటి ఆందోళనలు, ధ ర్నాలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో యాచారం మండలంలోని పలు గ్రామాల రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతులు, ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత హైకోర్టు రైతులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీచేసింది. ఫార్మా అనుబంధ గ్రామాల్లో రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేసుకోవచ్చ ని, పోలీసులు ఆటంకం కల్పించవద్దంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా, యాచారం మండలం మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద, తాటిపర్తి తదితర గ్రామాల్లో ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకోసం ప్రభుత్వ భూములను, కొన్ని పట్టా భూములను సైతం సేకరించింది. మరో 22 వేల ఎకరాల్లో పట్టా భూములు ఇవ్వటానికి రైతులు ఒప్పుకోలేదు.
ప్రభుత్వం ఇవ్వాల్సిందేనంటూ రైతులపై ఒత్తిడి తీసుకువచ్చింది. పట్టా భూములకు సంబంధించి ప్రకటించిన పరిహారాన్ని ప్రభుత్వం కోర్టులో జమచేసింది. ఆ తర్వాత రైతుల భూములను ఆన్లైన్లో నుంచి తొలగించి టీఎస్ఐఐసీ పేర్ల మీదకు బదలాయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆం దోళనకు దిగారు. బాధిత రైతులంతా ఫార్మా వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేసుకుని గ్రామా ల్లో ర్యాలీలు, అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ ర్యాలీలను అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే నిరాకరిస్తున్నారు. దీంతో బాధిత రైతులు ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యం లో హైకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి శుక్రవారం రైతులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీచేశారు. రాజ్యాంగపరంగా రైతులకు ఉన్న హక్కును కాలరాయొద్దని, శాంతియుతంగా వారు ఆందోళన చేసుకోవటంలో తప్పేంటని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు.
శాంతియుత ఆందోళనలు : కావుల సరస్వతి
హైకోర్టు సూచనల మేరకు శాంతియుతంగా పోరాడుతామని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సభ్యురాలు కావుల సరస్వతి తెలిపారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు తమ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పట్టా భూ ముల విషయం పునరాలోచించాలని కోరారు.