హైదరాబాద్ : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు( Vanama Venkateshwar rao) ఊరట లభించింది. అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే (Supreme Court Stay) ఇచ్చింది. ప్రతివాదులకు నోటిసులు జారీ చేస్తూ రెండువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణనను 4 వారాలకు వాయిదా వేసింది.
ఎన్నికల అఫిడవిట్లో వనమా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తూ ప్రత్యర్థి జలగం వెంకటరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు పలుమార్లు విచారించి గత నెల జులై 25న వనమాను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ వనమా తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.