హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశం వాడివేడిగా సాగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు 3 గంటలపాటు క్యాబినెట్ సమావేశం జరగగా.. సుమారు గంటసేపు అధికారులను బయటికి పంపి సీఎం, మంత్రులు మాత్రమే చర్చించుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా పలువురు మంత్రులు తమ ఆవేదన వెళ్లగక్కినట్టు తెలిసింది.
తమ శాఖల పరిధిలో బి ల్లులు మంజూరు కావటం లేదని, తాము సిఫారసు చేసినా చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు రావటం లేదని అసహనం వ్యక్తం చేశారట. రూ.5-10 లక్షలకు కూడా ఆర్థికమంత్రి వైపే చూడాలా? ఇలా అయితే మాకు మంత్రి పదవులు ఎందుకు? అని ఒకరిద్దరు గట్టిగా మాట్లాడినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
కొందరు అధికారులు తమను తక్కువగా చూస్తున్నారంటూ మంత్రులు ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సమావేశంలో ఎక్కువగా ఆర్ఆర్ఆర్, హైడ్రాపైనే చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్పై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కమిటీని వేయాలని నిర్ణ యం తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. హైడ్రామీద ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోవద్దని సీఎం సూచించినట్టు సమాచారం. మంత్రులు శాఖలవారీగా సమీక్షలు పెట్టాలని, పట్టు పెంచుకోవాలని సూచించినట్టు తెలిసింది.