హైదరాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఖర్చు అంచనాలను మించి, రెట్టింపు అయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెండు రోజుల సమ్మిట్‌కు ఇప్పటికే రూ.280 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారుల లెక్కల్లో తేలిందని సమాచారం. వివిధ ప్రభుత్వ శాఖలు చేసిన లెక్కా పద్దులను కూడా కలుపుకొంటే రూ.300 కోట్లు దాటే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ ఖర్చును ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉన్నది. గ్లోబల్ సమ్మిట్‌కు తొలుత రూ.150 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించారని లీకులు వచ్చాయి. ఆ తర్వాత రెట్టింపు ప్రజాధనం ఖర్చు కావటంతో ప్రభుత్వం, అధికారులు ఆందోళనతో ఉన్నట్టు తెలిసింది. ఖర్చుల వివరాలు ప్రతిపక్షాలకు తెలిస్తే రాద్ధాంతం చేస్తారని, పూర్తిస్థాయి లెక్కల మదింపు చేసి అధికారికంగా ప్రకటించేవరకు ఎక్కడా బయట పెట్టొద్దని సీఎంవో నుంచి ఆర్థిక శాఖకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
పబ్లిసిటీ కోసమే ప్రభుత్వం రూ.30 కోట్లు ఖర్చు చేసినట్టు ‘నమస్తే తెలంగాణ’కు పక్కా వివరాలు అందాయి. ముఖేశ్ అంబానీ, అదానీ, మిట్టల్, ఒబెరాయ్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్‌కు తరలివస్తారని ప్రచారం చేసింది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ దినపత్రికలు సహా వివిధ భాషల మ్యాగజైన్లు, టీవీ ఛానెళ్లలో ప్రకటనలు, ప్రసారాలు గుప్పించడంతో పాటు ఔట్‌డోర్ పబ్లిసిటీ కోసం రూ.30 కోట్లు ఖర్చు చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అన్ని భాషల మెయిన్‌స్ట్రీమ్ న్యూస్ పేపర్లతోపాటు స్మాల్, మీడియం పత్రికలకు కలిపి రూ.15.50 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చినట్టు చెప్తున్నారు. జాతీయ స్థాయిలో ఐదు మ్యాగజైన్లకు ఒక్కో దానికి రూ.1.01 కోట్లు, జాతీయ పత్రికలకు రూ.3.65 కోట్లు కలిపి మొత్తం రూ.8.71 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చినట్టు సమాచారం.
మీడియా వ్యయంలో ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన నాలుగు ప్రధాన మీడియా హౌస్‌లకే సింహభాగం నిధులు వెళ్లినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 44 దేశాల నుంచి 154 ప్రతినిధులు వస్తారని చెప్పిన ప్రభుత్వం, హైదరాబాద్ హోటళ్లలోని గదులన్నీ బుక్ చేసింది. ఆయా దేశాల నుంచి అంచనా వేసినంతగా ప్రతినిధులు రాలేదు. చివరికి కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు కూడా రాకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరంగా మారింది. హాజరైన వారి లిస్ట్‌లో పెద్ద అంతర్జాతీయ కార్పొరేట్ సీఈవోలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, వరల్డ్ లెవల్ ఇండస్ట్రీ లీడర్లు కనిపించలేదు.
గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెస్లా, మెటా, సామ్సంగ్, సిమెన్స్, ఫ్లాక్స్కోన్ లాంటి టాప్ మల్టీనేషనల్ కంపెనీలు రాలేదు. గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలు, ఫండ్ మేనేజర్లు, వెల్త్ ఫండ్స్ ఇలాంటివేవీ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనలేదు. దీంతో ప్రభుత్వం పరువును కాపాడుకోవడానికి పెయిడ్ ప్రసారాలు చేయించినట్టు సమాచారం. కొన్ని స్థానిక, జాతీయ ఛానళ్ల యాజమాన్యాలతో మాట్లాడుకొని పెయిడ్ లైవ్ ప్రసారాలను చేయించినట్టు తెలిసింది. ఇవన్నీ కలిపితే ప్రకటనల ఖర్చు రూ.16.60 కోట్లకు చేరిందని చెప్తున్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 3నుంచి 13వ తేదీ వరకు పది రోజుల పాటు హోర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టారు. 183చోట్ల హోర్డింగులు, 650 చోట్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు, 225 డివైడర్ల వద్ద గ్లొసెన్ బోర్డులు, 1500 మెట్రో పిల్లర్లకు పోస్టర్లు, యాడ్ బోర్డులు, మెట్రో రైల్ మీడియా ద్వారా 260 యాడ్లతో ప్రచారం ఊదరగొట్టారు. వీటి కోసం దాదాపు రూ.8.30 కోట్లు ఖర్చయినట్టు తెలిసింది. టీవీ ఛానెళ్లకు ఈ నెల 5 నుంచి 9వరకు ఐదు రోజుల పాటు యాడ్ ఫిల్మ్స్ రూపంలో రూ.2.38 కోట్లు ఖర్చు చేశారట. ఆకాశవాణి, ఎఫ్ఎం ద్వారా ప్రకటనలకు రూ.44 లక్షలు, రైల్వేస్టేషన్లు-బస్ స్టేషన్ల వద్ద ఎల్ఈడీ స్రీన్ల పబ్లిసిటీకి రూ.32 లక్షలు, హైదరాబాద్ సహా చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర 12 మెట్రోపాలిటన్ సిటీల్లోని ఎయిర్‌పోర్టుల వద్ద వివిధ రూపాల్లో ఐదు రోజుల పాటు పబ్లిసిటీ కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఈ మొత్తానికి కలిపి రూ.14.44 కోట్లు ఖర్చయినట్టు సమాచారం. మొత్తంగా యాడ్స్, పబ్లిసిటీ కోసం రూ.31.04 కుమ్మరించినట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి.
ఆనంద్ మహీంద్రా, దువ్వూరి సుబ్బారావు(ఆర్బీఐ మాజీ గవర్నర్), కార్తీక్ మురళీధరన్, టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, దిల్ రాజు, అల్లు అరవింద్ వంటివారే గ్లోబల్ సమ్మిట్‌లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరిలో ఎవరూ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ ఇన్వెస్టర్ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తులు కాదు. ఫ్యూచర్‌సిటీలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలతో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అసలు లక్ష్యానికి సుదూరంలోనే ఆగిపోయిందనే విమర్శలు మొదలయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి రెండు నెలలుగా ఈ ఈవెంట్‌పై వ్యక్తిగతంగా దృష్టిపెట్టినా, దావోస్ తరహా విజన్, 2047 తెలంగాణ బ్లూ ప్లింట్, మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ఊదరగొట్టినా అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందని ప్రభుత్వవర్గాలే పెదవి విరుస్తున్నాయి.