Harish Rao | హైదరాబాద్ జూలై 8 (నమస్తే తెలంగాణ): ‘నిలదీస్తే గాని కాంగ్రెస్‌లో కదలిక రాదా? మేం ప్రశ్నిస్తే తప్ప రైతుల నీటి తిప్పలు గుర్తుకు రావా? ’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.‘మేం లక్షలాది మంది రైతులతో వచ్చి మోటర్లు ఆన్ చేస్తమని ఇచ్చిన అల్టిమేటానికి కాంగ్రెస్ సర్కారు కదిలి కల్వకుర్తి మోటర్లు స్టార్ట్ చేసి నీళ్లు విడుదల చేయడం సంతోషకరం.. ఇది బీఆర్ఎస్ విజయం’ అని మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎగువ రాష్ర్టాల నుంచి వస్తున్న వరదను ఒడిసిపట్టాల్సిన ప్రభుత్వం నీటిని దిగువకు వదిలివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కల్వకుర్తి మాదిరిగానే కాళేశ్వరం మోటర్లను కూడా ఆన్ చేసి, రిజర్వాయర్లను నింపి గోదావరి నీళ్లను రైతుల పొలాలకు మళ్లించాలని డిమాండ్ చేశారు.
ఏపీవోలకు వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయం
ఉపాధిహామీ ఏపీవోలకు మూడు నెలలుగా వేతనాలివ్వకపోవడం శోచనీయమని హరీశ్ మండిపడ్డారు. చేసిన పనికి వేతనాలందక ఉపాధిహామీ సిబ్బంది ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మనోవేదనతో ఓ చిరుద్యోగి ప్రాణాలు కోల్పోవడం విచారకరమని వాపోయారు. పారిశుధ్య కార్మికులు సైతం జీతాల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందట ఓట్ల కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పెద్దలు ఉపాధి హామీ ఉద్యోగి మరణానికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధిహామీ, పారిశుధ్య కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. హఠాన్మరణం చెందిన జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన ఉపాధి ఏపీవో శ్రీనివాస్ మరణవార్తను తన పోస్ట్‌కు ట్యాగ్ చేశారు.
కల్వకుర్తి మోటర్లు ఆన్
బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు కదిలింది. మొదట ఈ నెల చివరినాటికో.. లేదా ఆగస్టు మొదటివారంలోనో కల్వకుర్తి మోటర్లను ఆన్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం, హరీశ్ అల్టిమేటంతో దిగివచ్చి మంగళవారమే పంపులను ఆన్ చేసి నీటి విడుదల ప్రారంభించింది.
కేసీఆర్ నాయకత్వంలో రైతులతో కదిలి పంపులు ఆన్చేస్తం
ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నయి.. కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే 15 జిల్లాలకు నీళ్లందుతయి.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. మరోవైపు కృష్ణాలో గడచిన 36 రోజులుగా వరద కొనసాగుతున్నా ఇప్పటికీ కల్వకుర్తి మోటర్లను ఆన్ చేయలేదు. నిరుడు కూడా ఇట్లనే నీళ్లను ఏపీకి వదిలిపెట్టి మహబూబ్‌నగర్‌లో క్రాప్ హాలిడే ప్రకటించిండ్రు. కండ్ల ముందు నీళ్లున్నా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదు. వారందాకా చూస్తం. కన్నెపల్లి, కల్వకుర్తి పంప్‌హౌస్ మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోస్తే సరి.. లేదంటే కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది రైతులతో కదులుతం..మోటర్లను ఆన్చేస్తం.
–ఈ నెల 6న (ఆదివారం) కాంగ్రెస్ సర్కార్‌కు అల్టిమేటం జారీ చేసిన బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు
పంపులు ఎప్పుడు ప్రారంభించాలో మాకు తెలుసు
కల్వకుర్తి పంపులను ఎప్పుడు ప్రారంభించాలో మాకు తెలుసు.. గతంలో తరహానే జూలై నెలాఖరున లేదంటే ఆగస్టులో ప్రారంభిస్తం ఎన్డీఎస్ఏ సూచనల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టుపై తగిన నిర్ణయం తీసుకుంటం.
– హరీశ్ హెచ్చరించిన అదే రోజు సాయంత్రం రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటన