హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సర్కా ర్ తీపి కబురు అందించింది. ప్రతి నెలా విడుదల చేస్తున్న పెండింగ్ బిల్లుల మొత్తాన్ని రూ.వెయ్యి కోట్లకు పెంచిన ప్రభుత్వం, ఈ నెలకు సంబంధించిన నిధులను బుధవారం విడుదల చేసింది. గత నెల వరకు నెలకు రూ.700 కోట్లు విడుదల చేయగా, తాజాగా వెయ్యికోట్లకు పెంచింది. ఈ నిధులతో జీపీఎఫ్ బకాయిలు క్లియర్ అయ్యాయి.
ముఖ్యం గా 2025 అక్టోబర్ వరకు పేరుకుపోయిన జీపీఎఫ్ బకాయిలన్నింటినీ విడుదల చేయడంతో రిటైర్డ్ ఉద్యోగులకు ఉపశమనం కలిగింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జాప్యంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒక ఉద్యోగి కోర్టును ఆశ్రయించగా, నాలుగు వారాల్లో పెన్షన్ ప్రయోజనాలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. టోకెన్ జారీ అయిన తేదీ నుంచి చెల్లింపు తేదీ వరకు 18% వార్షిక వడ్డీ ఇవ్వాలని హెచ్చరించింది. దీంతో రాబోయే వంద రోజుల్లో విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన రూ.6,200 కోట్ల బకాయిలు చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించి తాజాగా రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది.