సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి(Ethanol factory) వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మోతె మండలం రావిపహాడ్లో ఎన్ఎంకే బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీపై స్థానికులు కొద్దిరోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ యజమానులు ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా సంఘాలు ఆందోళనలు తీవ్రతరం చేశాయి. బుధవారం రావిపహాడ్లోని ఇథనాల్ ఫ్యాక్టరీ ఎదుట వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
ఇథనాల్ పరిశ్రమను మూసివేయాలంటూ నినాదాలు చేశారు. ఆందోళనల నేపథ్యంలో ఇథనాల్ పరిశ్రమ ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఫ్యాక్టరీని నెలకొల్పితే అడ్డుకుంటామని ఆందోళన కారులు హెచ్చరించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేశారు.