హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (ఎఫ్‌ఏటీహెచ్‌ఐ) ప్రభుత్వాన్ని కోరింది. బకాయిలతోపాటు టోకెన్లు జారీ చేసిన మొత్తం బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
ఎఫ్‌ఏటీహెచ్‌ఐ ప్రతినిధి బృందం బుధవారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం సమర్పించింది. 7న మంత్రులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని సమాఖ్య చైర్మన్ డాక్టర్ నిమ్మటూరి రమేశ్‌బాబు తెలిపారు.