Land Rates | హైదరాబాద్, జూన్ 14(నమస్తే తెలంగాణ): మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు అంతంత మాత్రంగానే ఉన్న రియల్ఎస్టేట్ రంగంపై భూముల ధరల పెంపు ప్రభావం భారీగా పడింది. ఈ నెల 5వ తేదీ నుంచి భూముల కొత్త ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు నేలచూపులు చూస్తున్నాయి. భూముల కొనుగోళ్లపై ప్రజలు ఆసక్తి చూపించడంలేదు. దీంతో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. వారంలోనే రిజిస్ట్రేషన్ల సంఖ్య 37% తగ్గడం ధరల పెంపు ప్రభావానికి అద్దం పడుతున్నది.
ఈ నెల తొలి వారంలో 27,985 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, ప్రభుత్వానికి రూ.252 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో వారంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పడిపోయింది. ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు 17,663 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కావడం గమనార్హం. తద్వారా ప్రభుత్వానికి రూ.164 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. అంటే భూముల ధరల పెరుగుదలతో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గింది.
మే తొలి వారంతో పోల్చితే రెండో వారంలో 10,322 డాక్యుమెంట్లు తగ్గడం గమనార్హం. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గడంతో అనివార్యంగా రిజిస్ట్రేషన్ల ఆదాయంపై ప్రభావం పడింది. వారం రోజుల్లోనే రూ.88 కోట్ల ఆదాయానికి గండి పడటం గమనార్హం. భూముల ధరలు పెంచుతూ ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయం రియల్ఎస్టేట్ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భూముల ధరలు పెంచుతామని ప్రభుత్వం ముందే ప్రకటించడంతో కొందరు గడువుకు ముందుగానే రిజిస్ట్రేషన్లు చేయించుకొన్నారని, తద్వారా మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నదని, ఆ తర్వాత తక్కువగా కనిపిస్తుందనే వాదనలు కూడా లేకపోలేదు. అయితే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే, ఈ వాదన కూడా వీగిపోతున్నది.
మే మొదటి వారంతో పోల్చితే ఈ నెల మొదటి వారంలో చెప్పుకోదగిన స్థాయిలో రిజిస్ట్రేషన్లు పెరుగలేదు. మే మొదటి వారంలో 22,068 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, ప్రభుత్వానికి రూ.234 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల మొదటి వారంలో 27,985 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రూ.252 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గత నెల మొదటి వారంతో పోల్చితే ఈ నెల మొదటి వారంలో 5,917 డాక్యుమెంట్లు అదనంగా రిజిస్ట్రేషన్ కాగా, ప్రభుత్వానికి రూ.18 కోట్లు మాత్రమే అదనపు ఆదాయం వచ్చింది.
మే రెండో వారంలో జరిగిన రిజిస్ట్రేషన్లతో పోల్చితే ఈ నెలలో తక్కువగానే కావడం గమనార్హం. మే రెండో వారంలో 21,387 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రూ.279 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల రెండో వారంలో 17,663 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రూ.164 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే గత నెలతో పోల్చితో ఈ నెల రెండో వారంలో 3,724 డాక్యుమెంట్లు తక్కువగా రిజిస్ట్రేషన్ కాగా ఆదాయం ఏకంగా రూ.115 కోట్లు తగ్గడం గమనార్హం.
రిజిస్ట్రేషన్లు తగ్గడంతో అనివార్యంగా ఆ ప్రభావం ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై పడుతున్నది. భూముల ధరలు పెంచినప్పటికీ ఆదాయం పెరుగడంలేదు. భూముల ధరల పెంపునకు ముందుతో పోల్చితే, ఆ తర్వాత ఆదాయం భారీగా తగ్గింది. ఈ నెల తొలి వారంలో ప్రభుత్వానికి రూ.252 కోట్లు రాగా రెండో వారంలో 164 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే వారం రోజుల్లోనే రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.88 కోట్లు తగ్గింది. గత నెల తొలి రెండు వారాలతో పోల్చితే ఈ నెల రెండు వారాల్లో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా భారీగా పడిపోయింది. ఈ నెల తొలి రెండు వారాల్లో రూ.416 కోట్ల ఆదాయం సమకూరగా, మే నెల తొలి రెండు వారాల్లో రూ.513 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే 97 కోట్ల ఆదాయం తగ్గడం గమనార్హం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే భూముల రిజిస్ట్రేషన్ విలువలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుత ధరలపై 25% నుంచి 100% వరకు పెంచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపాలిటీలతోపాటు ఓఆర్ఆర్ పరిధిలో అంతకు మించి పెంచింది. ప్రభుత్వం 100% వరకు మాత్రమే పెంచినట్లు చెప్తున్నా, ఆ పెంపు 300 శాతానికిపైగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెయిన్ రోడ్డు పక్కన గల భూములు, కొన్ని ప్రైమ్ ఏరియాల్లోని ఓపెన్ ప్లాట్ల ధరలను భారీగా పెంచింది. వీటితోపాటు అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలను కూడా భారీగా పెంచింది. తద్వారా ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి.
గతంతో పోల్చితే ఓపెన్ ప్లాట్లు తీసుకొన్న వారికి కనీసం రూ.2 లక్షలు పెరుగగా, అపార్ట్మెంట్ ఫ్లాట్లు తీసుకొన్న వారికి భారీ మొత్తంలో పెరిగినట్టు తెలిసింది. ఈ ఖర్చులు భరించలేక ప్రజలు భూములు, ఇండ్ల కొనుగోళ్లకే దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టు పలువురు రియల్ఎస్టేట్ ఏజెంట్లు చెప్తున్నారు. భూముల ధరల పెంచకముందు ఒప్పందాలు జరిగినవి మాత్రమే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవుతున్నాయని, ఇవి పూర్తయితే మరింత దారుణమైన పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు.
