చౌటుప్పల్, మార్చి 24 : చౌటుప్పల్, భువనగిరి ప్రాంతానికి చెందిన రీజనల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావును సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఉత్తర భాగం అలైన్మెంట్ మార్పునకు కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. అశాస్త్రీయమైన అలైన్మెంట్ కారణంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండు ముక్కలు అవుతుందని తెలిపారు. దక్షిణ భాగంలో ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు పరిధిని 40 కిలోమీటర్లు తీసుకుని, ఉత్తర భాగంలో మాత్రం 28 కిలోమీటర్లు తీసుకున్నారని వాపోయారు. ఇప్పటికే 65వ నంబర్ జాతీయ రహదారి, హైటెన్షన్ స్తంభాల ఏర్పాటు సమయంలో భూములు కోల్పోయామని, ఇప్పుడు ఉన్న కొద్దిపాటి భూమి ట్రిపుల్ ఆర్కు ఇస్తే రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. తమ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడి న్యాయం చేయాలని కోరారు. హరీశ్‌రావు స్పందిస్తూ సమస్య పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చినట్టు భూనిర్వాసితులు తెలిపారు. నిర్వాసితుల ఐక్య వేదిక కన్వీనర్ చింతల దామోదర్‌రెడ్డి, నాయకులు దబ్బేటి రాములుగౌడ్, మారుపాక రామలింగంగౌడ్, జాల వెంకటేశ్‌యాదవ్, మల్లేశం గౌడ్, ఉన్నారు.