Passport | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3(నమస్తే తెలంగాణ): పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేశామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ జొన్నలగడ్డ స్నేహజ వెల్లడించారు. సాధారణ పాస్‌పోర్ట్‌కు వారం గడువుండగా, తత్కాల్ పాస్‌పోర్ట్‌ను ఒకటి నుంచి మూడు రోజుల్లోనే జారీ చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో పలు వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని, సికింద్రాబాద్ రీజినల్ పరిధిలోని పీఎస్కే, పీవోపీఎస్కేలలో రోజూ 4,200 పాస్‌పోర్ట్ దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నామని తెలిపారు.
2024లో 9.02 లక్షల దరఖాస్తులను పరిశీలించగా, వాటిలో 7.97 లక్షల మందికి పాస్‌పోర్టులను జారీ చేశామని వివరించారు. ఈ దరఖాస్తులోనే పాస్‌పోర్ట్ జారీ, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌తోపాటు ఇతర సంబంధిత సేవలున్నాయని తెలిపారు. మనదేశంలోనే పాస్‌పోర్ట్ సేవల వినియోగంలో హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్ట్ కేంద్రం ప్రముఖంగా ఉన్నదని, రాబోయే రోజుల్లో వర్షన్-2 ద్వారా మరింత మెరుగైన సదుపాయాలు కలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
సికింద్రాబాద్ రీజినల్ పరిధిలోని పాస్‌పోర్ట్ కేంద్రాల్లో పాస్‌పోర్ట్‌ల జారీ ప్రక్రియ అత్యంత వేగవంతంగా జరుగుతున్నదని స్నేహజ తెలిపారు. గతంలో సాధారణ పాస్‌పోర్ట్ స్లాట్‌బుకింగ్‌కు 22 రోజులు, తత్కాల్‌కు 5 నుంచి 7 రోజుల సమయం పట్టేదని, ఇప్పుడు చాలా తక్కువ సమయంలో పాస్‌పోర్ట్ స్లాట్‌బుకింగ్ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. సాధారణ పాస్‌పోర్టును కేవలం 5 నుంచి 7 రోజుల్లో జారీ చేస్తున్నామని, తత్కాల్ దరఖాస్తులకు మరునాడే ఇస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ రీజినల్ పరిధిలోని 5 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో అపాయింట్మెంట్ సైకిల్ 2023లో 22 రోజులుంటే 2024లో ఆరు నుంచి ఎనిమిది పనిదినాలకు తగ్గించామని తెలిపారు. 14 పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో వారంలోపే పాస్‌పోర్ట్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నదని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్ పీఎస్‌కేలలో సాధారణ అపాయింట్మెంట్లు మరుసటి రోజులోనే చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ పీఎస్కేలో మాత్రం సాధారణ అపాయింట్మెంట్ 6 నుంచి 8 రోజులు, తత్కాల్ ఒకటి నుంచి ఐదు రోజుల్లో ఉంటాయని తెలిపారు.
హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ కేంద్రం లో ఎంక్వైరీ అపాయింట్మెంట్ సిస్టమ్‌తో ప్రతీ గురువారం సగటున 700 నుంచి 800 మంది దరఖాస్తుదారులు అంటే ఈ ఏడాది సుమారుగా 30 వేల మంది వాక్ఇన్ సదుపాయాన్ని పొందారని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ జొన్నలగడ్డ స్నేహజ తెలిపారు. గ్రీవెన్స్‌లో ఈమెయిల్స్ ద్వారా 10 వేల ఫిర్యాదులు వచ్చాయని, వాటిని కేవలం రెండు నుంచి మూడురోజుల్లోనే పరిష్కరించామని చెప్పారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని మెరుగుపరచడానికి వీలుగా సోషల్ మీడియా వేదికలతోపాటు వాట్సప్ నంబర్ (918121401532)ను కేటాయించామని, ప్రజలు తమ ఫిర్యాదులను ఈ నంబర్లో తెలపాలని కోరారు. గ్రీవెన్స్‌కు సంబంధించి పాస్‌పోర్టు ప్రక్రియలో దళారుల వ్యవస్థను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
క్రిమినల్ కేసులకు సంబంధించిన పాస్‌పోర్టుల సీజ్ విషయంలో కోర్టు సూచనలను తాము అనుసరిస్తున్నామని, పాస్‌పోర్ట్ చట్టం ప్రకారమే వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి పీవోపీఎస్కే వద్ద ఉన్న మొబైల్ వ్యాన్ సమర్థవంతంగా పనిచేస్తున్నదని, అది ఆ ప్రాంత దరఖాస్తుదారులకు అంతరాయం లేని సేవలను అందిస్తున్నదని తెలిపారు. భారత రాజ్యాంగం 75 ఏండ్ల మైలురాయిని పురస్కరించుకుని, రీజనల్ ఆఫీస్ ప్రత్యేక ఎన్వలప్‌ను ప్రారంభించిందని, దీనిని పాస్‌పోర్ట్ జారీకి వినియోగిస్తామని తెలిపారు. హైదరాబాద్ ఆర్పీవో పరిధిలోని అతిపెద్దదైన వరంగల్ పీవోపీఎస్కేలో ప్రతీరోజూ 130 మంది దరఖాస్తుదారులను అందిస్తున్నదని, మిగతా చోట్ల ప్రతీరోజూ 90 దరఖాస్తుదారుల క్యాచ్డే ఉన్నట్టుగా ఆమె పేర్కొన్నారు.
సికింద్రాబాద్ రీజినల్ ఆఫీసులోనే బ్రాంచ్ సెక్రటేరియట్ ఉన్నదని, ఇది చాలా మందికి తెలియదని స్నేహజ తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, డిపెండెంట్ వీసా దరఖాస్తుదారులు తమ సర్టిఫికెట్ల అటెస్టేషన్ చేయించుకోవడానికి ఢిల్లీ వరకు వెళ్తున్నారని, కానీ హైదరాబాద్‌లోనే రెండు తెలుగు రాష్ర్టాలకు సంబంధించిన బ్రాంచ్ సెక్రటేరియట్ సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ బ్రాంచ్ సెక్రటేరియట్లో అటెస్టేషన్, అపాస్టిల్స్ చేస్తామని, ఈ అవకాశాన్ని వినియోగించుకునేవారు రోజురోజుకూ పెరుగుతున్నారని చెప్పారు. నిరుడు 1,400 మంది అటెస్టేషన్, అపాస్టిల్స్ చేయించుకున్నారని తెలిపారు.