హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): దేశ రక్షణ కోసం అహర్నిశలు ప్రాణాలను పణంగా పెట్టే సైనికులకు ఇంటి పట్టా ఇచ్చే విషయంలో స్థానికత ఆపాదించడం సబబు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. స్థానికత ఆధారంగా ఏపీకి చెందిన మాజీ సైనికుడికి ఇంటి స్థలం పట్టాను నిరాకరించడం చట్టబద్ధం కాదని స్పష్టంచేసింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 80 ఏండ్ల మాజీ సైనికుడు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏవీ శ్రవణ్‌కుమార్ తీర్పు వెలువరించారు. 1971 భారత్ -పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్న సీతారామరాజు తీవ్రంగా గాయపడటంతో వైద్య కారణాల రీత్యా 1975లో సైన్యం నుంచి ఉద్యోగ విరమణ పొందారు.
కూకట్‌పల్లిలో స్థిరపడిన ఆయన, అంగవైకల్యం పొందిన మాజీ సైనికులకు ఇంటిస్థలం కేటాయించేందుకు ప్రభుత్వం రూపొందించిన విధానం ప్రకారం ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అనే కారణంతో రంగారెడ్డి కలెక్టర్ 2014లో పిటిషనర్ దరఖాస్తును తోసిపుచ్చారు. దీనిపై 2015లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు.. పీ సీతారామరాజు అలియాస్ పీఎస్ రాజుకు మూడు నెలల్లో తెలంగాణలోని మున్సిపల్ ప్రాంత పరిధిలో ఇంటి స్థలం, పట్టా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.