భద్రాచలం, అక్టోబర్ 28 : మాది ప్రజా పాలన అంటూ పదే పదే వల్లె వేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో కక్షపూరిత పాలన సాగిస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(Rega Kantha Rao) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా పాలనను గాలికొదిలేసిన మంత్రులు విదేశీ యాత్రల్లో విహరిస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించిందన్నారు. కేటీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణ సంప్రదాయం ప్రకారం దావత్ చేసుకుంటే దానిని రేవ్ పార్టీగా చిత్రీకరించి రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని, కార్యకర్తలు అధైర్యపడకుండా ముందుకు సాగాలన్నారు.
పాలక ప్రభుత్వాలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల గొంతునొక్కే ప్రయత్నం చేస్తే అంతకంతకూ ముందుకు పోతామని రేగా స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు మానే రామకృష్ణ, చర్ల మండల అధ్యక్షుడు సోయం రాజారావు, సీనియర్ నాయకులు శ్రీనివాసరాజు, ఆకోజు సునీల్‌కుమార్, కణితి రాముడు, కోల రాజు, రేసు లక్ష్మి, రామిరెడ్డి, ప్రకాశ్, గుంజా ఏడుకొండలు, సీతామహాలక్ష్మి, కీసర యువరాజు తదితరులు పాల్గొన్నారు.