Haritha Haram | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): హరితహారం లక్ష్యాన్ని ఈ ఏడాది కుదించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. ఏటా 19కోట్ల నుంచి 20కోట్ల మొకలు నాటుతుండగా, ఈ ఏడాది 13 కోట్ల మొకలు మాత్రమే నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్క్‌ను చెరిపేయడానికి హరితహారం కార్యక్రమం పేరును కూడా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అటవీ శాఖ ఇప్పటికే కొన్ని పేర్లను సూచించగా, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. పక్షం రోజుల్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అటవీశాఖ అధికార వర్గాల సమాచారం. గతేడాది 19.29 కోట్ల మొకలు నాటడం లక్ష్యంగా పెట్టుకోగా 30.29 కోట్ల మొకలు నాటారు. స్థలాల లభ్యత సవాలుగా మారిన నేపథ్యంలో మొక్కలు నాటే సంఖ్యను కుదించినట్లు నిర్ణయించినట్లు అటవీ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఈ మేరకు జిల్లా స్థాయి కమిటీలు ఇప్పటికే ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. గతానికి భిన్నంగా ఈసారి అలంకార మొకల కంటే పెద్ద మొకలు నాటడంపైనే శాఖ దృష్టి సారించింది. ఫలాలను ఇచ్చే మొకలు, పీపాల్, వేప,రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు (ప్రోసోపిస్ సినారియా లిన్) విసృ్తతంగా పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. 2015 జూలై 3న కేసీఆర్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు రూ.10,822 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 273 కోట్ల మొకలు నాటించింది. మూడో అతిపెద్ద పర్యావరణ పరిరక్షణ ప్రయత్నంగా హరితహారం గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం 7.7శాతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం పేరొంది.