హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సంస్థ కార్మికుల మస్టర్లు కుదించి.. వారి కడుపు కొట్టొద్దని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అన్ని డిపోల్లోని కార్మికులపై మేనేజర్ల వేధింపులు తక్షణమే ఆపాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, ఈదురు వెంకన్న కోరారు.
నాలుగు రోజుల నుంచి భద్రాచలం డిపోలో మూడు రోజుల మస్టర్లను రెండు రోజులకు కుదించడం దారుణమని పేర్కొన్నారు. పనిభారాన్ని తగ్గించాలని, బలవంతపు డ్యూటీలు చేయలేమని కార్మికులు చెబుతున్నా.. డిపో మేనేజర్ నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు హెచ్చరించారు.