‘గర్భిణులకు సకాలంలో పౌష్ఠికాహారం అందిస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు.. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగితేనే బలమైన దేశ నిర్మాణం సాధ్యం..’ అని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్ ఓ మహత్తర ఆలోచన చేశారు. రాష్ట్రంలో రక్తహీనతతో ఏ తల్లీ,పోషకాహారలోపంతో ఏ బిడ్డా బాధపడొద్దని ‘ఆరోగ్యలక్ష్మి’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఏడేండ్లు పూర్తిచేసుకొన్న ఈ పథకం రాష్ట్రంలో ప్రసూతి, శిశుమరణాల రేటును గణనీయంగా తగ్గేలా చేసింది. దేశంలోని 11 రాష్ర్టాలు మన పథకంపై అధ్యయనం చేసేలా
ఆదర్శంగా నిలిచింది.
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రక్తహీనతతో బాధపడే తల్లులు, పోషకాహార లోపంతో వయసుకు తగినట్టుగా ఎదగక బాధపడుతున్న పిల్లల కోసం తెలంగాణ సర్కారు ‘ఆరోగ్య లక్ష్మి’ పథకాన్ని 2015 జనవరి 1న ప్రారంభించింది. రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ పథకం విజయవంతంగా అమలు అవుతున్నది. ఈ పథకానికి నేటితో ఏడేండ్లు పూర్తయ్యాయి. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రభుత్వం రోజూ పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నది. ఈ పథకం ద్వారా ఈ ఏడేండ్ల కాలంలో మొత్తం 31 లక్షల మంది గర్బిణులు, బాలింతలు లబ్ధి పొందారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.22 అదనం..
అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార సరఫరాకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.6 మాత్రమే ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో భోజనానికి అదనంగా రూ.22 కలిపి ఖర్చు చేస్తున్నది. దీంతో గతంలో ఇచ్చిన ఆహారానికి.. ప్రస్తుతం అమలు చేస్తున్న మెనూకు చాలా తేడా ఉందని అధికారులు చెప్తున్నారు.
v 7 నెలల నుంచి 3 ఏండ్లలోపు వయసు ఉన్న పిల్లలకు గతంలో నెలకు 8 కోడి గుడ్లు మాత్రమే ఇచ్చేవారు. ఆరోగ్యలక్ష్మిలో భాగంగా 16 కోడిగుడ్లు అందిస్తున్నారు. వీటితోపాటు గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ప్రతి నెలా అందిస్తున్నారు.
v3-6 ఏండ్ల వయసున్న పిల్లలకు గతంలో నెలకు 16 గుడ్లు అందించేవారు. ఆరోగ్యలక్ష్మి కింద ఇప్పుడు ప్రతి రోజూ ఒక గుడ్డు ఇస్తున్నారు. అదనంగా పిల్లలకు అన్నం, పప్పు, కూరగాయలు, స్నాక్స్ అందిస్తున్నారు.
vగర్భిణులు, బాలింతలకు గతంలో నెలకు 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో నూనె ఇచ్చేవారు. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా అన్ని అంగన్వాడీల్లో మధ్యాహ్నం పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నారు. కనీసం 25 రోజులపాటు సంపూర్ణ భోజనం, 200 మిల్లిలీటర్ల పాలు అందిస్తున్నారు. గతంలో 68 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నెలకు 16 గుడ్లు, 81 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో నెలకు 25 గుడ్లు అందించేవారు. ప్రభుత్వం ఈ అసమానతలను తొలిగిస్తూ ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా అందరికీ ప్రతి రోజూ గుడ్డు అందిస్తున్నది.
పథకంతో సత్ఫలితాలు
ఆరోగ్యలక్ష్మి అమలుతో అనేక సత్ఫలితాలు వచ్చాయని స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ పథకం ముఖ్యంగా ప్రసూతి మరణాల రేటు (ఎంఎంఆర్) తగ్గింపులో కీలక పాత్ర పోషించింది. 2014లో 92గా ఉన్న ఎంఎంఆర్ ఇప్పుడు 43కు తగ్గింది. శిశు మరణాల రేటు 39 నుంచి 26కు తగ్గిందని జాతీయ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకు 11 రాష్ర్టాలకు చెందిన ప్రతినిధుల బృందాలు వచ్చి అధ్యయనం చేయడం ఈ పథకం విశిష్టతకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఆరోగ్యలక్ష్మి కార్యక్రమానికి జాతీయస్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు లభించింది. గత ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మినీ అంగన్వాడీ వర్కర్‌కు జాతీయస్థాయి ఉత్తమ సేవా పురస్కారం దక్కింది.
అంగన్వాడీ హెల్ప్‌లైన్ 155209
అంగన్వాడీ కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం హెల్ప్ లైన్ 155209ను ఏర్పాటుచేసింది. పౌష్టికాహార పంపిణీసహా ఇతర సేవల్లో అంతరాయాలు, అంతరాలు ఉంటే హైదరాబాద్ మహిళా కమిషనరేట్ కార్యాలయం నుంచే నేరుగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ హెల్ప్‌లైన్ పనిచేస్తున్నది.