భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ మహదేవపూర్(కాళేశ్వరం)/కన్నాయిగూడెం, జూలై 28: భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 6 గంటలకు 53 అడుగులుగా ఉన్న వరద ప్రవాహం.. మధ్యాహ్నం 2 గంటలకు మూడు అడుగులు తగ్గి 50 అడుగులకు చేరుకుంది. సాయంత్రానికి మరో అడుగు తగ్గి 49 అడుగుల వద్ద కొనసాగుతుంది. సోమవారం ఉదయానికి మరికొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 48 అడుగులకు పైన ప్రవాహం కొనసాగుతున్నందున రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. అధికారులు ఆదివారం 25 గేట్లు పూర్తిగా ఎత్తి 26,986 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బరాజ్‌కు వరద ప్రవాహం తగ్గుతున్నది. శనివారం బరాజ్ ఇన్‌ఫ్లో 5,39,200 క్యూసెక్కులు ఉండగా, ఆదివారం ఇన్‌ఫ్లో 4,06,510 క్యూసెక్కులకు తగ్గింది. బరాజ్‌లోని అన్ని గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బరాజ్‌లోకి చిన్న చిన్న కాల్వలు, మానేరు ద్వారా ఆదివారం 8,147 క్యూసెక్కుల ప్రవాహం రాగా, మొత్తం 66 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్‌లోకి ఆదివారం 8,45,560 క్యూసెక్కు ల వరద చేరింది. బరాజ్ వద్ద పూర్తిస్థాయి నీటిమట్టం 83 మీటర్లు కాగా, ప్రస్తుతం 81.80 మీటర్ల ఎత్తులో పారుతున్నది. 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
కృష్ణమ్మ ఉగ్రరూపం
హైదరాబాద్, జూలై28 (నమస్తే తెలంగాణ): ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో కృష్ణానది ఉధృతంగా ప్రవాహిస్తున్నది. కర్నాటక, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పొంగి పొర్లుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి దిగువన జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతున్నది. ఆదివారం సాయంత్రానికి జూరాలకు 3 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం ప్రాజెక్టుకు 4.14 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహం కొనసాగుతున్నది. 24 గంటల్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకు 25 టీఎంసీలకు పైగా వరదనీరు వచ్చి చేరడం విశేషం. మరోవైపు ప్రాణహిత, గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన ఎస్సారెస్పీ, దాని దిగువన ఎల్లంపల్లి, లక్ష్మీ బరాజ్‌ల వద్ద వరద నెమ్మదించింది. దిగువన ఇంద్రావతి, తాలిపేరు, శబరి నుంచి భారీగా వరద కొనసాగుతుండటంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం స్వల్పంగా తగ్గినా స్థిరంగా కొనసాగుతున్నది.