(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, హైదరాబాద్ 24 (నమస్తే తెలంగాణ): ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అనే నానుడిని నిజం చేస్తున్నది. దేశంలో ఉద్యోగాల కల్పన నానాటికీ తీసికట్టుగా మారుతున్నా, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుతూ దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్నా.. ప్రధాని మోదీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. గత ఎనిమిదేండ్లుగా ఏటికేడు నిరుద్యోగులు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ప్రచారార్భాటాలతో ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నది. ఓవైపు పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మేస్తున్న విషయం తెలిసిందే. లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉన్నా.. భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిరుద్యోగుల కండ్లలో మట్టికొడుతున్నది. ఇదే సమయంలో యువతకు ఉపాధి కల్పించేందుకు కంపెనీలు తేవడంలో విఫలమవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ సభ్యత్వం(ఈపీఎఫ్) లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
మూడు నెలల నుంచి వరుసగా..
ఈపీఎఫ్ తాజా లెక్కల ప్రకారం ఉద్యోగాల కల్పనలో భారత్ గ్రాఫ్ 17 నెలల కనిష్టానికి పడిపోయింది. ప్రతీ నెల కొత్తగా ఉద్యోగులు తీసుకునే ఈపీఎఫ్ సభ్యత్వం లెక్కలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. అక్టోబర్‌లో కొత్తగా ఈపీఎఫ్ తీసుకొన్న ఉద్యోగుల సంఖ్య 7,27,899 కాగా, సెప్టెంబర్‌తో పోలిస్తే 25.9 శాతం తగ్గింది. దీనికి మూడు నెలల నుంచి కొత్త ఉద్యోగుల ఈపీఎఫ్ రిజిస్ట్రేషన్ల సంఖ్య వరుసగా తగ్గుతూ వచ్చింది. ఆగస్టులో జూలైతో పోలిస్తే 9.4 శాతం తగ్గిపోగా, సెప్టెంబర్‌లో 6.1 శాతం తగ్గింది. ఇదిలా ఉండగా అక్టోబర్‌లో కొత్తగా ఈపీఎఫ్ సభ్యత్వం పొందిన పురుషులు.. మహిళల కంటే 26.1 శాతం తక్కువగా ఉండటం గమనార్హం.