Summer | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. బుధవారం ఎండ తీవ్రత మరింత పెరిగింది. రానున్న వారం రోజులు వడగాడ్పుల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లా గూడా పూర్లో 46.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ములుగు జిల్లా మంగ పేట, కొత్తగూడెం జిల్లా భద్రాచలం, సూర్యా పేట జిల్లా నగాల, నల్లగొండ జిల్లా చండూర్లో 46.5, నల్లగొండ జిల్లా తిమ్మాపూర్, ఖమ్మం జిల్లా వైరా, ఖానాపూర్, జగిత్యాల జిల్లా వెల్గటూర్, పెద్దపల్లి జిల్లా ముత్తారంలలో 46.4, మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచలో 46.3, జగిత్యాల జిల్లా జైనాలో 46.2, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2, అల్లీపూర్ (జగిత్యాల) 46.1, కొత్తగట్టు (కరీంనగర్ ) 46, కోల్వాయి (జగిత్యాల) 46, వీణవంక 46, వెల్గటూరు (జగిత్యాల) 45.9, తెల్దేవరపల్లె 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో 15 జిల్లాలకు రెడ్అలర్ట్, 18 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణశాఖ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి-కొత్తగూ డెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈనెల 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.