Heavy Rains | హైదరాబాద్ : వాయువ్య మధ్య బంగాళాఖాతం సమీపంలో వాయుగుండం ఏర్పడింది. పూరీ తీరానికి దక్షిణ ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దూరంలో, గోపాల్‌పూర్‌కు తూర్పు దిశగా వాయుగుండం కేంద్రీకృతమైంది. క్రమంగా వాయువ్య దిశగా వాయుగుండం ప్రయాణం చేస్తుంది. పూరీ, కళింగపట్న సమీపంలో వాయుగుండం తీరం దాటనుంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దాదాపు 12 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.