హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన జీవో 21లో పేర్కొన్న మార్గదర్శకాలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పీహెచ్డీ అభ్యర్థులు, సీనియర్ ప్రొఫెసర్లు ఆరోపిస్తున్నారు. మరో పక్క కాంట్రాక్టు, పార్టుటైమ్ అధ్యాపకులు తొలుత తమ పోస్టులను క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కొన్ని రోజులుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు సమాచారం. జీవో 21ను పునఃసమీక్షించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. పలువురు సీనియర్ ప్రొఫెసర్లతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. జీవోపై అభ్యంతరాలు, వినతులు సేకరిస్తున్నారు. నివేదిక రూపొందించి, రాష్ట ప్రభుత్వానికి పరిశీలన కోసం పంపే ప్రయ త్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన వచ్చిన తర్వాత ఈ అంశంపై మరికొంత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో రిజర్వేషన్ల విధానంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ పోస్టుల భర్తీ కోసం యూనివర్సిటీని యూనిట్‌గా తీసుకుంటారా? డిపార్టుమెంట్, సబ్జెక్టులను యూనిట్‌గా తీసుకుంటారా? అన్న అంశంపై స్పష్టత కోసం నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.