హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపే సిఫారసు లేఖలను ఆన్లైన్ ద్వారా పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. సీఎంఆర్ఎఫ్ తరహాలో ప్రత్యేక పోర్టల్‌తోపాటు యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధి తన కోటాలో ఏ రోజు ఎన్ని సిఫారసు లేఖలు ఇవ్వవచ్చో అన్ని మాత్రమే జారీచేసేలా ఈ యాప్ వీలు కల్పిస్తుంది. మ్యాన్యువల్‌గా లేఖలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఏపీలో ఇదే తరహా విధానం అమలవుతున్నది. ప్రజాప్రతినిధులు తమకు కేటాయించిన కోటాకు మించి లేఖలు రాయడం, తీరా అక్కడికి వెళ్లాక ఇబ్బందులు తలెత్తడం వంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
పాలకమండలి ఆమోదిస్తేనే..
టీటీడీ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణ యం తీసుకున్నా దానిని బోర్డు ఆమోదించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు టీటీడీలో చెల్లుబాటయ్యేలా ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతోపాటు ఇదే విషయమై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఈ ప్రతిపాదనను పాలకమండలి ఆమోదించిన తర్వాతే లేఖలు చెల్లుబాటవుతాయని అధికారవర్గాలు తెలిపాయి.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లున్న భక్తులకు నేరుగా స్వామివారి దర్శన అవకాశం కల్పిస్తున్నామని టీటీడీ తెలిపింది. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతున్నదని వెల్లడించింది. మంగళవారం స్వామివారిని 70,610 మంది భక్తులు దర్శించుకోగా 17,310 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు కానుకల ద్వారా స్వామివారికి రూ.3.78 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.