హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): మనిషికి గాలి, నీరు ప్రాణాధారం. ఆధునిక సాంకేతిక యుగంలో ఈ రెండింటికి మరొకటి తోడైంది. అదే.. విద్యుత్తు. ఈ భూమిపై విద్యుత్తు ఎక్కడ పుష్కలంగా ఉంటే.. ఆర్థికాభివృద్ధి అక్కడే కేంద్రీకృతమై ఉంటున్నది. మానవాభివృద్ధి అక్కడే అధికంగా ఉంటున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వెనుకబడిపోవటానికి కరెంటు కొరత కూడా ఒక కారణం. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే పరిస్థితి తిరగబడింది. నేడు దేశానికి తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు పాఠాలు నేర్పుతున్నది. మరీ ముఖ్యంగా తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ మహానగరం భారతదేశపు పవర్ ఐలాండ్‌గా అవతరించింది. ప్రతి అంతర్జాతీయ సంస్థ్థ హైదరాబాద్‌లోనే ల్యాండ్ అవుతుండటమే ఇందుకు సాక్ష్యం.
డాటా సెంటర్ల రాజధాని
సాధారణంగా అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఒక డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలంటే ఎంత విద్యుత్తు అవసరమో తెలుసా? అక్షరాలా 100-150 మెగావాట్లు. మరి.. అదే ఓ పది సెంటర్లకు ప్రతిపాదనలు వస్తే? హైదరాబాద్ మినహా ఇప్పటికిప్పుడు దేశంలోని ఏ మెట్రో నగర పరిధిలోనూ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే పరిస్థితులు లేవు. ఇది నిజం.. దక్షిణాది రాష్ర్టాల సదస్సుల్లోనూ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు వెల్లడిస్తున్న వాస్తవాలివి. పుష్కలమైన కరెంటు, అందుకు అనుగుణంగా అన్నిరకాల వ్యవస్థలు ఉన్నందునే ఒక్కో అంతర్జాతీయ కంపెనీ హైదరాబాద్ చుట్టుపక్కల మూడేసి చొప్పున సుమారు పదిహేను డాటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. కంపెనీలు ప్రతిపాదనలు సమర్పించిందే తడవుగా ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు ఆమోదం తెలుపుతున్నారు. ఉమ్మడి ఏపీలో ‘మాకు కరెంటు ఇవ్వండి మహా ప్రభో’ అంటూ ఇందిరాపార్కు వద్ద పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన స్థితి నుంచి ఇప్పుడు ‘ఎంత కరెంటు కావాలో చెప్పండి.. క్షణాల్లో సమకూరుస్తాం’ అని తెలంగాణ ప్రభుత్వం అభయం ఇచ్చే స్థాయికి చేరుకోవటం విశేషం. ఆర్థిక, పారిశ్రామిక, ఐటీలాంటి అన్ని రంగాలకూ గుండెకాయలాంటి హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్ ‘పవర్ ఐలాండ్’గా మార్చారు. దేశంలోనే తొలి పవర్ ఐలాండ్ మెట్రో నగరంగా హైదరాబాద్ ప్రశంసలు అందుకొంటున్నది.
వన్ అండ్ ఓన్లీ హైదరాబాద్
హైదరాబాద్ మినహా దేశంలో కరెంటు సమస్య లేని మెట్రో నగరం లేదు. కేరళలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నదనే విమర్శలున్నాయి. బెంగళూరు సరైన కరెంటు సరఫరా వ్యవస్థ, సరిపడినన్ని సబ్స్టేషన్ల సామర్థ్యం లేక అవస్థలు పడుతున్నది. తమిళనాడులో డిమాండ్-సరఫరా బొటాబొటీగా ఉన్నది. ఏపీ పరిస్థితి వీటికి కొంచెం మెరుగు. హైదరాబాద్ పరిస్థితి వీటన్నింటికీ భిన్నం. ఇక్కడ ప్రస్తుతం అత్యధిక విద్యుత్తు డిమాండ్ 3,400 మెగావాట్లు కాగా, ఇప్పటికిప్పుడు 6 వేల మెగావాట్ల విద్యుత్తును కూడా సరఫరా చేసే సామర్థ్యం హైదరాబాద్‌కు ఉన్నది. వీటన్నింటికీ మించి జాతీయ గ్రిడ్ విఫలమైనా హైదరాబాద్ పవర్ ఐలాండ్ స్వతంత్రంగా పనిచేసేలా సీఎం కేసీఆర్ దీనిని రూపొందించారు.
నగరం చుట్టూ మూడు వలయాలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్డు వ్యవస్థకు అనుగుణంగా విద్యుత్తు వలయాలను ఏర్పాటు చేశారు. నగరం చుట్టూ ఇన్నర్ రింగు రోడ్డు, ఔటర్ రింగు రోడ్డు ఉన్నాయి. రీజినల్ రింగు రోడ్డు వస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్తు ఐలాండ్‌ను నగర కేంద్రంగా చుట్టూ 25 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేశారు. నగరం చుట్టూ మరో 80-100 కి.మీ. పరిధిలో ఒకటి, 180-200 కి.మీ పరిధిలో మరో ఐలాండ్‌ను నెలకొల్పారు. హైదరాబాద్ చుట్టూ మూడు విద్యుత్ వలయాలు ఏర్పాటయ్యాయి. ఏడేండ్ల కిందటే హైదరాబాద్ ఐలాండ్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై, నైవేలీ, కూడంకుళం, విశాఖపట్నంలోనూ ఐలాండ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఊహించని వేగంతో పనులు
గతంలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కావాలంటే మంజూరీకే నెలలు పట్టేది. అన్నీ మంచిగా జరిగితే ఏడాదిలోపు ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కావడమనేది గొప్ప విషయం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 400/220 కేవీ సబ్ స్టేషన్లను అలవోకగా ఏర్పాటు చేసింది. వందలకొద్ది ట్రాన్స్ఫార్మర్లను అమర్చింది. వేల కిలోమీటర్ల మేర విద్యుత్తు లైన్లను కొత్తగా ఏర్పాటు చేసింది. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రూ.12-13 వేల కోట్ల విలువైన పనులను పూర్తి చేసినందునే హైదరాబాద్ పవర్ ఐలాండ్‌గా మారింది.
హైదరాబాద్ పవర్ ఐలాండ్ ఎలా పని చేస్తుందంటే..