మహబూబ్‌నగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటమాడుతున్నది. మధ్యాహ్న భోజనం వికటించి ఇటీవల 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనను మరువకముందే మంగళవారం నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యా హ్న భోజనం తిన్న గంట తర్వాత 40మంది వాంతులు, విరేచనాలతో తరగతి గదుల్లోనే కుప్పకూలారు. కడుపునొప్పితో విలవిల్లాడారు. వెంటనే వారిని ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న 28 మందిని మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని ఓ బాలికల కళాశాలలో భోజనంలో బొద్దింకలు రావడంతో విద్యార్థులు భయంతో వణికిపోయారు.
మాగనూర్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత నెల 20న ఇలాంటి ఘటనే జరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారం రోజులుగా వారి సమక్షంలోనే విద్యార్థులకు వండిపెడుతున్నారు. తహసీల్దార్ సురేశ్ పర్యవేక్షణలో ప్రతి రోజూ దగ్గరుండి వడ్డిస్తున్నారు. మంగళవారం ఇలానే వడ్డించారు. విద్యార్థులు ఒంటిగంటకు భోజనం చేయగా, మధ్యాహ్నం 3:30 గంటలకు తరగతి గదిలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి అంటూ ఏడుస్తూ బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయుల ముందే వాంతులు చేసుకున్నారు. ఉపాధ్యాయులు వారిని బైక్‌లు, ఆటోల్లో మాగనూరు పీహెచ్‌సీకి, అక్కడి నుంచి మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో 9వ తరగతి చదువుతున్న నేత్ర, రూప పరిస్థితి విషమంగా ఉండడంతో మక్తల్ నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం మక్తల్ ప్రభుత్వ దవాఖానలో 26 మంది చికిత్స పొందుతున్నారు. 12 మంది కోలుకోవడంతో ఇండ్లకు పంపించారు.
మక్తల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పరామర్శించారు. వారం క్రితం ఇదే పాఠశాలలో ఆహారం కలుషితమైనా జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దగ్గరుండి వంటలు వండిస్తున్నా ఫుడ్ పాయిజన్ ఎలా అయిందని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లులు చెల్లించకపోవడం, నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయకపోవడం, టీచర్లకు, అధికారులకు మధ్య సమన్వయం లోపించడంతో విద్యార్థులు నలిగిపోతున్నారని మండిపడ్డారు.
విద్యార్థులు దవాఖానల పాలవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఒక పూటైనా కడుపునిండా భోజనం చేస్తారనుకుంటే పరుగుల అన్నం పెట్టి వారిని చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ కలెక్టర్ బంగ్లా వద్ద గల ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్లో విద్యార్థులకు మంగళవారం వడ్డించిన చట్నీ, సాంబార్లో బొద్దింకలు దర్శనమిచ్చాయి. దీంతో విద్యార్థులు వడ్డించిన భోజనాన్ని పారబోశారు. ప్రతిరోజూ ఇలాగే పురుగులు వస్తున్నాయని, హాస్టల్‌ను ఎవరూ పర్యవేక్షించడం లేదని వాపోయారు. వార్డెన్ అసలు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ ఘటనపై కలెక్టర్ విజయేందిర బోయి ఆరా తీశారు. కూరగాయల్లో బొద్దింకలు వచ్చిన ఘటనపై అదనపు కలెక్టర్ మోహన్‌రావు, అధికారులు హాస్టల్‌ను తనిఖీ చేశారు. స్టోర్‌రూం, కిచెన్ అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్‌కు నివేదించారు.
సీఎం సొంత జిల్లాలో రోజుకో ఘటన కలకలం రేపుతున్నది. సాక్షాత్తు కొడంగల్ నియోజకవర్గంలో ఇదేవిధంగా ఫుడ్ పాయిజన్ అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వారం కిందట మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్‌పై స్పందించిన అధికారులు హెచ్ఎం, ఇన్చార్జి హెచ్ఎంలను సస్పెండ్ చేశారు.
మాగనూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం భోజనానికి ముందు 22 మంది వివిధ బేకరీలు, దుకాణాల్లో తినుబండారాలు తిన్నారని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కు కారణంపై గ్రామంలోని బేకరీలు, కిరాణా షాపులను అధికారులు తనిఖీ చేశారు. ఆయా షాపుల్లో అమ్మేవన్నీ నాసిరకం ఫుడ్‌గా తేల్చారు.
నవంబర్ 20: మాగనూర్ ఉన్నత పాఠశాల అన్నంలో పురుగులు రావడంతో భోజనం తిన్న 100 మంది విద్యార్థులకు అస్వస్థత. మాగనూరు, మక్తల్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స.
కారణం: కల్తీ గుడ్లను వాడటంతో ఫుడ్ పాయిజన్
చర్యలు: పాఠశాల హెడ్మాస్టర్ మురళీధర్, ఫుడ్ ఇన్చార్జి బాబురెడ్డి సస్పెండ్, వంట ఏజెన్సీ తొలగింపు.
నవంబర్ 21: అదే పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మళ్లీ పురుగులు. అన్నం పారబోసిన విద్యార్థులు.
సొంత ఖర్చుతో విద్యార్థులకు భోజనం పెట్టించిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి.
చర్యలు: నారాయణపేట డీఈఓ అబ్దుల్ ఘనీ బదిలీ ఆర్డీవో రామచంద్ర, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ, ఎంపీడీవో ముద్దీన్కు షోకాజ్ నోటీసులు.
నవంబర్ 26 : మాగనూరు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 40 మంది విద్యార్థులకు అస్వస్థత. ఇద్దరి పరిస్థితి విషమం.
నవంబర్ 26: మహబూబ్‌నగర్ ఎస్సీ బాలికల హాస్టర్‌లో చట్నీ, సాంబార్లో బొద్దింకలు. ఆహారాన్ని పారబోసిన విద్యార్థులు.. కలెక్టర్ ఆరా.
చర్యలు: కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్న కుక్ తొలగింపు.. హెచ్‌డబ్ల్యూవో బదిలీకి కలెక్టర్ ఆదేశం.