హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : పన్నేండుళ్లుగా బలపం పట్టలేదు. పాఠం చెప్పలేదు. అయినప్పటికీ పీజీటీ నుంచి జేఎల్‌గా, డీఎల్‌గా పదోన్నతి పొందారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రిన్సిపల్‌గా ప్రమోషన్ దక్కించుకున్నారు. అలా ఓడీ పేరిట ఇప్పటికీ ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలోనే ఓడీ పేరిట తిష్ట వేశారు. ఎస్సీ గురుకుల సొసైటీలో కొనసాగుతున్న డిప్యూటేషన్ల పర్వానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. ఆయన ఒక్కరే కాదు అరడజను మందికిపైగా డిప్యూటేషన్లపై పాగా వేశారు. సొసైటీలో చక్రం తి ప్పుతున్నారు. ఇటీవల డిప్యూటేషన్లను రద్దు చేసినా ప్రధాన కార్యాలయంలోని వారికి మి నహాయింపులు ఇవ్వడం కొసమెరుపు. అదీగా క కొందరిని డిప్యూటేషన్‌పై మళ్లీ సొంత జిల్లాలకు పంపారు. సొసైటీ పాలన పూర్తిగా గాడితప్పుతున్నదని యూనియన్లు మండిపడుతున్నాయి. ప్రభుత్వం స్పందించి డిప్యూటేషన్లపై దృష్టి సారించాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి.
ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఏకంగా 22 మంది డిప్యూటేషన్లపై ఏండ్లుగా పాగా వేశారు. వారిలో ఒకరు 12 ఏండ్ల నుంచి అక్కడే పాతుకుపోయినా ఎవ రూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రధాన కార్యాలయంలో ఓడీపై విధులు నిర్వర్తిస్తున్న సదరు ఉద్యోగి సొసైటీలో పీజీటీగా చేరారు. దశాబ్దకాలం క్రితం డిప్యూటేషన్‌పై ప్రధాన కార్యాలయంలో పాగా వేశారు. కనీసం ఒక్కరోజు కూడా పాఠం చెప్పకుండా అక్కడే జేఎల్‌గా ప్రమోషన్ తీసుకున్నారు. బోధన అనుభవం లేకుండానే మళ్లీ డీఎల్‌గా పదోన్నతి పొందారు. నిబంధనలను తుంగలో తొక్కి డీఎల్ ప్రిన్సిపల్‌గా ప్రమోషన్ తీసుకున్నారు. వాస్తవానికి సొసైటీ బైలా ప్రకారం 30% పోస్టులను ప్రమోషన్ల ద్వారా, మిగిలిన 70% పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. కానీ, అందుకు విరుద్ధంగా మొత్తం 100%పోస్టులను ప్రమోషన్ల ద్వారానే సొసైటీ భర్తీ చేసింది. డీఎల్ ప్రిన్సిపల్ పోస్టులను కామన్ సినీయార్టీ ఆధారంగా భర్తీ చేసిన చరి త్ర దేశ విద్యావ్యవస్థలోనే ఎక్కడా లేదు. డీఎల్ పోస్టుకు సంబంధించినది అయితే, ప్రిన్సిపాల్ పోస్ట్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించినది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాల ప్రకారం 15 ఏండ్ల బోధ న అనుభవం, పీహెచ్డీ, సమర్పించిన రీసెర్చ్ పత్రాలు, అకడమిక్ ఫర్మార్మెన్స్ ఇండెక్స్ (ఏపీఐ) ఆధారంగా ప్రమోషన్లను కల్పించాలి.
మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రభు త్వం 2019లో అన్ని సొసైటీలకు ఉత్తర్వు (జీవో 15) జారీ చేసింది. కానీ, సొసైటీ ఉన్నతాధికారులు నిబంధనలను తుంగలో తొక్కి, అర్హతలను పరిశీలించకుండా కేవలం కామన్ సీనియార్టీ ఆధారంగా డీఎల్ ప్రిన్సిపల్‌గా ప్రమోషన్ కల్పించారని యూనియన్ నేతలు మండిపడుతున్నారు. సోషల్ వెల్ఫేర్‌లో మొత్తం మహిళా డిగ్రీ కాలేజీలే ఉన్నాయి. మ హిళా గురుకులాల్లో మహిళా టీచర్లనే నియమించాలనే నిబంధన ఉన్నది. కానీ, ఆ నిబంధనకు పాతరేశారు. ఇక డీఎల్ ప్రిన్సిపల్‌గా ప్రమోషన్ పొందిన తరువాతనైనా కేటాయించిన గురుకుల డిగ్రీ కాలేజీకి వెళ్లారా అంటే అదీ లేదు. మళ్లీ డిప్యూటేషన్‌పై ఇటీవల సొసై టీ ప్రధాన కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తుండడం కొసమెరుపు. అలా ఆయన ఒక్కరే కాకుండా మరో పీజీటీ కూడా సుదీర్ఘకాలం నుంచి సొసైటీ ప్రధాన కార్యాలయంలోనే కొనసాగుతున్నారు. కీలకమైన సీవోఈ బాధ్యతలను నిర్వర్తిస్తూ తన కంటే పెద్దస్థాయిలో ఉన్న ప్రిన్సిపల్స్, జేఎల్, డీఎల్, అకడమీషియన్లపై పెత్తనం చెలాయిస్తున్నారు. వారే కాదు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ)లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), డిగ్రీ లెక్చరర్స్ (డీఎల్స్) కలిపి దాదాపు 22 మంది హెడ్ ఆఫీస్‌లో పాగా వేశారు. దీనిపై సొసైటీ యూనియన్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో కొందరు ఏండ్లుగా తిష్ట వేసి సొసైటీని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ బాగోతంపై సొసైటీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, అందరి డిప్యూటేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జీవో నంబర్ 1274, తెలంగాణ సబార్డినేట్ సర్వీసు నిబంధనల్లోని 22 (ఏ) (3) రూల్ ప్రకారం బాలికల విద్యా సంస్థల్లోని అన్ని పోస్టుల్లో మహిళా సిబ్బందిని మాత్రమే నియమించాలి. కానీ, గతంలో బదిలీలు, ప్రమోషన్ల సమయంలో సొసైటీ ఉన్నతాధికారులు ఆ జీవోను పూర్తిగా తుంగలో తొక్కారు. ఆ తర్వాత ఇటీవల మళ్లీ అదే జీవో అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా బాలికల గురుకులాల్లో విధులు నిర్వర్తిస్తున్న 57 మంది పురుష సిబ్బందిని డిప్యూటేషన్‌పై వేరే గురుకులానికి పంపారు. ఇంటర్ గురుకుల కాలేజీల్లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి పలు గ్రూపుల్లో మార్పులు చేయడంతో తదనుగుణంగా మరో 89 మంది జూనియర్ లెక్చరర్లను డిప్యూటేషన్లపై నియమించారు. సీవోఈ, నాన్-సీవోఈ పోస్టుల్లోనూ డిప్యూటేషన్లపై సిబ్బందిని నియమించారు. దీంతో సొసైటీ కార్యదర్శి, ఉన్నతాధికారుల తీరుపై గురుకుల ఉపాధ్యాయులు, యూనియన్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ సొసైటీ పెడచెవిన పెట్టడంతో పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సొసైటీ తాజాగా ఆ డిప్యూటేషన్లను రద్దు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వారిలో కొందరిని మినహాయించింది.
అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్‌పై ఇటీవల సొసైటీలో నలుగురు జోనల్ ఆఫీసర్లకు డిప్యూటేషన్‌ను కల్పించారు. అవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. ఆ డిప్యూటేషన్లపై రాత్రికి రాత్రే ఉత్తర్వులు రావడం చర్చనీయాంశంగా మారింది. జోన్-1 ఆఫీసర్ అరుణ కుమారిని జోన్-5లో, జోన్-5 ఆఫీసర్ విద్యారాణిని జోన్-6లో, జోన్-7 ఆఫీసర్ నిర్మలను ఆఫీసర్‌గా మల్టీజోన్-1లో, అకడమిక్ డిప్యూటీ సెక్రటరీని జోన్-4లో, స్టేట్ ఆఫీసర్‌గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న మల్టీజోన్-2 ఆఫీసర్ రజనిని హెడ్ ఆఫీస్‌లో డిప్యూటేషన్‌పై నియమించారు. ఎస్సీ గు రుకుల సొసైటీ ఉన్నతాధికారులు నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్‌పై డిప్యూటేషన్ ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో గతంలో బదిలీల సందర్భంగా ఇవేమీ ఆలోచించకుండానే పోస్టింగ్ ఇచ్చారా? అని యూనియ న్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారు లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు.