CM KCR | ‘బంగారు తెలంగాణ’పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అసలు బంగారు తెలంగాణ అంటే ఏంటో చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘మహేశ్‌రెడ్డి అయితే మీ తరఫున యుద్ధం చేస్తడు. యుద్ధం ఎవరు చేస్తరో వాళ్ల చేతిలో కత్తిపెట్టాలి గానీ.. కొత్త ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకడిని చేయమంటే చేస్తారా? సాధ్యం కాదు కదా. చెట్టుకొకరు గుట్టకొకరు అయిన రైతాంగం మొఖాలు ఇప్పుడిప్పుడే మొఖాలు తెల్లబడుతున్నయ్. అప్పులు గట్టుకుంటున్నం. ఇంకో పది పదిహేనేళ్లు రైతుబంధు, కరెంటు ఇస్తే ఎక్కడివాళ్లు అక్కడ మంచిగైతరు. నేను కోరుకున్న బంగారు తెలంగాణ ఇదే. బంగారు తెలంగాణ అంటే ఎక్కడో ఆకాశంలో ఉండదు. రైతు తన సొంత పెట్టుబడితోని వ్యవసాయం చేసుకున్న రోజే బంగారం తెలంగాణ. నేను కలగనేది అదే’నన్నారు.
‘చాలా మంది కాంగ్రెస్ మిత్రులకు తెలియదు. నేను పదవి కోసం కొట్లాడుతున్న అనుకుంటున్నరు. వాళ్లు పిచ్చోళ్లు. మూర్ఖులు. తెలంగాణ తీసుకువచ్చాం. ఖచ్చితంగా పేదరిక నిర్మూలన జరిగే తెలంగాణ కావాలి. ఖచ్చితంగా వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలి. ఈ రాష్ట్రం నుంచి పేదరికం పారద్రోలేదాకా పని చేయాలనే ఉద్దేశంతో ఫైట్ చేస్తున్నాం. నేను అల్రెడీ నేను ముఖ్యమంత్రి అయ్యాను. మీ దయతో ఒకటికాదు రెండుసార్లు అయ్యాను. ఇంకా నాకేదో పదవి అనేది కాదు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం ఇండియాలో నెంబర్ వన్‌గా నిలువాలని అన్నింట్లో. ఆ కమిట్మెంట్తో కొట్లాడుతున్నాం’ అన్నారు.
‘ఒక మాట గర్వంగా, సంతోషంగా చెబుతున్న. ఒక రాష్ట్రం బాగుపడిందా? చెడిపోయిందా? అని చూసేందుకు కొన్ని గీటురాళ్లు ఉంటయ్. మొదటి గీటురాయి రాష్ట్రం తలసరి ఆదాయం. పెరిగిందా? తగ్గిందా అని చూస్తారు. 2014లో తెలంగాణ వచ్చిన నాడు తలసరి ఆదాయం లక్షలోపు ఉండే. ఇవాళ 3.18లక్షలతో ఇండియాలోనే నెంబర్‌వన్‌గా ఉన్నది తెలంగాణ. మనం ఎంత ముందుకుపోయినమే మీరు ఆలోచన చేయొచ్చు. తలసరి విద్యుత్ వినియోగంలో 2014లో 1100 యూనిట్లు ఉండేది.
ఇవాళ 2200యూనిట్లకు పెరిగింది. ఈ విధంగా అభివృద్ధి వచ్చాం. మంచినీళ్లు కూడా తీసుకువచ్చాం. కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్లు.. ఎత్తుగున్నోళ్లు ఎంత మంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్ రాజ్యంలో.. కనీసం మంచినీళ్లైనా ఇచ్చారా? ఎన్ని బాధలు పడ్డాం. గ్రామాల్లో బోర్లు కాలిపోతుంటే.. మోటర్లు కాలుతుంటే సర్పంచులు, ప్రజలు బాధపడ్డ బాధలు అప్పుడే మరిచిపోయామా? రబ్బర్ బిందెలు పట్టుకొని ఎక్కడెక్కడికో తెచ్చుకున్నాం. బోరింగ్లు కొట్టి కొట్టి అలసిపోవుడు.. ఆ బాధలు లేవు. ప్రతి ఇంట్లో నల్లాబెట్టి ప్రతి లంబాడి తండాలో నల్లా పెట్టి బ్రహ్మాండంగా నల్లా నీళ్లు ఇచ్చుకుంటున్నాం’ అన్నారు.