హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి సర్కారు అసమర్థ, అసంబద్ధ విధానాలతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలకరిచింది. హైడ్రా ఎఫెక్టుతోపాటు నిర్మాణరంగంపై ప్రభుత్వ పాలసీ ప్రకటించకపోవడంతో రియల్ఎస్టేట్, నిర్మాణరంగం తీవ్రంగా ప్రభావితమైంది. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి క్రమంగా పెరిగిన రియల్ రాబడి రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రివర్స్ అయింది. గ్రామాల్లో వ్యవసాయ భూములు అమ్ముదామన్నా కొనే దిక్కు లేకుండాపోయింది. ఫలితంగా రాష్ర్టానికి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయ అంచనాలు తలకిందులవుతున్నాయి. కాగ్ తాజా గణాంకాల ప్రకారం.. కొవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న 2020-21లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 52 శాతం నమోదైంది. కొవిడ్ రెండోదశ 2021-22లో కూడా రిజస్ట్రేషన్ ద్వారా 98 శాతం రాబడి వచ్చింది. రేవంత్‌రెడ్డి సీఎంగా పాలనాపగ్గాలు చేపట్టిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఆదాయం 46 శాతానికి పడిపోయింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.19,087.26 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, నవంబర్ 2025 నాటికి వచ్చింది రూ.9,911.26 కోట్ల్లే (అంటే 51.93%).
2025-26 బడ్జెట్లో ల్యాండ్ రెవెన్యూ కింద రూ.11.20 కోట్లు వస్తాయని ఆశించగా, నవంబర్ వరకు వచ్చింది రూ.47 లక్షలు (4.21%) మాత్రమే. 2024-25లో కూడా నవంబర్ నాటికి కేవలం రూ.73 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. బడ్జెట్ అంచనాలను భారీగా పెంచుతున్నప్పటికీ, వాస్తవ ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరుగడం లేదు. కాగ్ నివేదికల ప్రకారం.. ప్రతి సంవత్సరం నవంబర్ నాటికి సాధిస్తున్న లక్ష్యం క్రమంగా తగ్గుతున్నది. 2022లో గరిష్ఠంగా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ ఆదాయం 60.31 శాతం వచ్చింది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గత ఐదేండ్లలో స్థిరత్వం కోల్పోయి, తిరోగమన దిశలో పయనిస్తున్నది. ప్రభుత్వ ఆదాయం బడ్జెట్ అంచనాల్లో సగానికి మించి రాకపోవడం రియల్ రంగానికి ముంచుకొస్తున్న గండానికి నిదర్శనమని స్థిరాస్తి వ్యాపార నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కొవిడ్ తర్వాత చాలామంది తమ పెట్టుబడులను స్థిరాస్తి వ్యాపారంపై పెట్టారు. బంగారం, స్టాక్స్ కంటే కూడా భూముల ధరలు పెరుగుతుండటంతో మెరుగైన లాభాలు వస్తాయనే ఉద్దేశంతో చాలామంది వ్యవసాయ భూములు, ప్లాట్లు కొన్నారు. అందుకే తెలంగాణలో 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు రూ.7 వేల కోట్లు దాటని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం.. రెండేండ్లలో రెట్టింపు అయింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.12 వేల కోట్ల పైచిలుకు ఆదాయం వచ్చింది. 2022, 2023లో రియల్ రంగం పీక్స్‌కు చేరింది. ఒక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారానే రాష్ట్ర ఖజానాకు రూ.14 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. కాంగ్రెస్ అధికారం చేపట్టిన రెండేండ్లలోనే స్థిరాస్తి రంగం కుప్పకూలింది. భూముల కొనుగోళ్లు, అమ్మకాలు లేక రిజిస్ట్రేషన్, తహసీల్దార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఫలితంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయానికి భారీగా గండిపడింది.
