Congress Govt | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. హైదరాబాద్‌లో అయితే చిన్నజాగ, ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా జనం బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి పిడుగు వేస్తుందోనని రియల్ ఎస్టేట్‌కు ఆమడదూరంలో ఉంటున్నారు. రియల్ పరిస్థితి దారుణంగా తయారైందని ప్రముఖ కంపెనీల అధ్యయనాలు, వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. కానీ రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి ఢోకా లేదని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు చెప్పుకొస్తున్నారు. ఇదంతా పైపై మాటలేనని, అసలు సంగతి దాచిపెడుతున్నారని తెలుస్తున్నది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి బాగాలేదని ప్రభుత్వం పరోక్షంగా ఒప్పుకున్నట్టు స్పష్టమవుతున్నది. అందుకే హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను అమ్మడం కన్నా కుదువ పెట్టడంపైనే దృష్టిసారించిందని చర్చ జరుగుతున్నది.
అనుకున్నదొక్కటీ.. అయిందొక్కటి!
భూముల అమ్మకంతో నిధులు సమీకరించాలని, వాటితో ప్రధాన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కానీ కాంగ్రెస్ అధికారం చేపట్టగానే రియల్ ఢమాల్ అయింది. వ్యాపారవర్గాల్లో నమ్మకం సన్నగిల్లింది. అంతేకాకుండా ఆదాయమార్గాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడంలేదని, అసమర్థ విధానాలతో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రియల్ ఎస్టేట్‌కు కీలకమైన హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో హైడ్రా కారణంగా అమ్మకాలు కుప్పకూలాయని అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. ప్రభుత్వ విధానాలతో కొత్త పెట్టుబడులు రాకపోగా, ఉన్న పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని పారిశ్రామికవర్గాలు చెప్తున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్ధత నెలకొన్నది. ఇలాంటి సమయంలో భూములు వేలం వేస్తే అనుకున్న ధర పలకదని ప్రభుత్వ పెద్దలకు నిపుణులు, అధికారులు తేల్చిచెప్పినట్టు తెలుస్తున్నది.
అప్పుడు రూ.100 కోట్లు
మౌలిక రంగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, సమగ్రాభివృద్ధిపై కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, విధానాలతో రాష్ట్రంలో భూములకు మంచి గిరాకీ ఏర్పడింది. పదేండ్లలోనే భూముల ధరలు దాదాపు పదిరెట్లు పెరిగాయి. హైదరాబాద్ పరిధిలో అబ్బురపడే ధర పలికింది. 2023 ఆగస్టులో కోకాపేటలోని నియోపొలిస్ ఫేజ్-2 వేలంలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో రూ.100 కోట్లు పలికి, ఎస్టేట్ రంగంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం రూ.35 కోట్లకు బిడ్డింగ్ ప్రారంభిస్తే మూడు రెట్లు ఎక్కవ ఆదాయం వచ్చింది. అత్యల్పంగా వచ్చిన ధరనే ఎకరానికి రూ.67.25 కోట్లు అంటే అప్పటి హవా అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు అందుకోవడం కష్టం
రాష్ట్రవ్యాప్తంగా భూముల అమ్మకంపై కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యయనం చేయించింది. హెచ్ఎండీఏ పరిధిలో మొదటి దశలోనే 400 ఎకరాలు విక్రయించాలని ప్లాన్ చేసింది. కానీ నివేదికలు చూసి ప్రభుత్వ పెద్దలు నిట్టూర్చినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగాలేదని ప్రభుత్వాన్ని నిపుణులు హెచ్చరించినట్టు తెలుస్తున్నది. ఇప్పుడు వేలం వేస్తే అంచనా కంటే 40 శాతం తక్కువ ఆదాయం వచ్చే అవకాశమున్నదని అధికారులు తేల్చిచెప్పారట. వేలానికి వెళ్లిన తర్వాత అలాంటి పరిస్థితి ఎదురైతే భూముల ధరలు పడిపోయినట్టు ప్రభుత్వమే ఒప్పుకున్నట్టు అవుతుందని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలుతుందని స్పష్టంచేశారట. దీంతో ప్రభుత్వం భూముల అమ్మకం నిర్ణయాన్ని పక్కనపెట్టిందని, భూములను బ్యాంకులను తనఖా పెట్టాలని నిర్ణయం తీసుకున్నదని తెలుస్తున్నది. ఈ మేరకు ఇప్పటివరకు దాదాపు 400 ఎకరాలను తనఖా పెట్టారని, మరో 400 ఎకరాలను సిద్ధంచేశారని సమాచారం.