హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో భూముల వేలం అంటే అంచనాలకు మించిన పోటీ.. రికార్డు ధరలు.. లెక్కకు మించిన ఆదాయం.. కానీ ఎకరం రూ.100 కోట్లు పలికిన ఇదే రాజధానిలో.. ఇప్పుడు చదరపు గజానికి రూ.2 వేలు పెరగడమే గగనంగా మారింది. వంద ప్లాట్లను వేలానికి పెడితే 3 ప్లాట్లు అమ్మేందుకే ముప్పుతిప్పలు పడే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లో అట్టడుగుకు చేరిన రియల్ ఎస్టేట్ ట్రెండ్‌కు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరం వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాలతోపాటు, రియల్టీకి ప్రధాన వేదికగా నిలిచింది.
ఐటీ రంగానికి దీటుగా రియల్ ఎస్టేట్ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో ఎకరం రూ.100 కోట్లకు విక్రయించే స్థాయికి నగరం ఎదిగింది. నిర్మాణ రంగంలో హైదరాబాద్.. దేశంలోని అన్ని మెట్రో నగరాలకు గట్టి పోటీనిచ్చి, భారీ స్థాయిలో అమ్మకాలతో ఖజానాను కళకళలాడించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం మౌలిక వసతులపై ప్రధానంగా దృష్టి పెట్టింది. నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే తాగునీరు, వైద్యం, ఉద్యోగ అవకాశాలను కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసింది. దీంతో వారి కొనుగోలు సామర్థ్యం పెరిగి, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. దీంతో ఏటా భూములు, ఇండ్ల ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్లేవి. ఇదంతా గతం. ఇప్పుడు 20 నెలల కాంగ్రెస్ పాలనలో పరిస్థితి తలకిందులైంది.
వేలంతో రియల్టీ గుట్టురట్టు
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కూల్చివేతలకు దిగింది. ప్రభుత్వ భూముల ఆక్రమణల పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేసింది. అనుమతులు ఉన్నా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను కూడా భయభ్రాంతులకు గురిచేసింది. మూసీ ప్రక్షాళన పేరిట బఫర్ జోన్‌ను నిర్ధారించి, దశాబ్దాల కిందటి ఇండ్లను అక్రమ నిర్మాణాలంటూ ఏకంగా నోటీసులనే జారీచేసింది. ఇలా గడిచిన 20 నెలల్లో నగరంలోని రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ సర్కార్ ముప్పుతిప్పులు పెట్టింది. దీంతో రిజిస్ట్రేషన్ ఆదాయంతోపాటు, భవన నిర్మాణ అనుమతులూ నిలిచిపోయాయి. ఇటీవల హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరిగిన భూముల వేలంలో ఈ విషయం తేలిపోయింది. మూడు ప్లాట్లు అమ్మడానికి రూ.కోట్లు ఖర్చు చేస్తే… కనీసం నిర్వహణ ఖర్చుల మేర పెరుగలేదు.
3 ప్లాట్లు అమ్మితే.. 50 కోట్లు రాలే
గతంలో కోకాపేట నియోపోలిస్‌లో ఒక్క ఎకరం రూ.100 కోట్లకు హెచ్ఎండీఏనే విక్రయించింది. ఇప్పుడు మూడు జిల్లాల పరిధిలో అభివృద్ధి చేసిన వెంచర్లలో 100 ప్లాట్లను వేలానికి పెడితే మూడింటినే విక్రయించింది. ఇందులో రెండు తుర్కంయాంజల్, ఒకటి పుప్పాలగూడ ల్యాండ్ పార్సిల్ ఉండగా, వీటి ద్వారా వచ్చిన ఆదాయం కూడా రూ.50 కోట్లు దాటలేదు. రంగారెడ్డి జిల్లా పరిధిలో గండిపేట, శేరిలింగంపల్లి మండలాల పరిధిలోని పుప్పాలగూడ, చందానగర్, బైరాగిగూడ, కోకాపేటలో సగటున అర ఎకరం ఉండే ప్లాట్లను విక్రయానికి పెట్టింది. ఇందులో ఏ ఒక్క ప్లాట్ అమ్ముడుపోలేదు. పుప్పాలగూడలోని 1,630 గజాల బిట్టుకు ఇద్దరు పోటీపడితే నిర్ధారించిన ధర కంటే గజానికి రూ.2వేలు పెరిగింది.
కొంప ముంచిన కాంగ్రెస్ విధానాలు
హైదరాబాద్ రియల్టీలో సంక్షోభ పరిస్థితులు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేసిన విధానాలే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉన్నా.. అడ్డగోలు కూల్చివేతలు, నిర్మాణ అనుమతులపై అజమాయిషీ, పెద్దల పేరిట సొమ్ము చేసుకుంటున్న అవినీతి అధికారుల పనితీరే సిటీ రియల్టీకి ప్రధాన సమస్యగా మారుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో కొందరు ఉన్నతాధికారులు వసూళ్లే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని అనుమతుల ప్రక్రియను ఇప్పటికీ శాసిస్తున్నారు. దీనికితోడు ఉన్నతస్థాయి అధికారుల నిర్లక్ష్యం భూముల వేలానికి ఆదరణ లేకుండా చేసిందనే అభిప్రాయం ఉన్నది.