(స్పెషల్ టాస్క్బ్యూరో) హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూశాఖ, దగ్గరుండి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేలా వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతున్నది. శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి పరిధిలోని బసవతారక్నగర్లో కొన్నిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో సర్వే నంబర్ 37లోని రెండు సబ్డివిజన్స్లోని ఎనిమిది ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్టు శనివారం అక్కడ బోర్డు ఏర్పాటుచేసింది.
కానీ ఇందులో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 164 కింద స్వాధీనం చేసుకుంటున్నట్టు పేర్కొన్నది. రెండు ప్రైవేట్పార్టీల మధ్య భూమిపై వివాదం నెలకొన్న సందర్భంలోనే ఈ సెక్షన్ ప్రకారం భూమిని స్వాధీనం చేసుకుంటుంది. అంటే ఇప్పటికీ ఈ భూమిని రెవెన్యూశాఖ ప్రైవేట్ భూమిగా గుర్తించడమంటే పరోక్షంగా బిగ్ దందాకు గేట్లు బార్లా తెరవటమే.
ఉమ్మడి రాష్ట్రంలో ఇందులోని 32.31 ఎకరాలను అప్పటి ఏపీ ఎన్జీవోలకు (ఇప్పటి భాగ్యనగర్ టీఎన్జీవో) కేటాయించారు. ఈ భూమిని ఆనుకొని గతంలో సర్కారు కేటాయించిన స్థలంలో నియాబ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ) క్యాంపస్ కూడా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకొని ఇన్నాళ్లూ కాపాడింది.
ప్రైవేటు వ్యక్తులు వచ్చినప్పటికీ అధికారుల నివేదిక ఆధారంగా వారికి దక్కనీయలేదు. కానీ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సర్వే నంబర్ 37లో 30 ఎకరాలకు ఎన్వోసీలు జారీ అయినట్టు శేరిలింగంపల్లి తహసీల్దార్ తెలిపారు. దీంతో పాటు కొన్నిరోజులుగా కొందరు ప్రైవేటు వ్యక్తులు బస్తీలోని గుడిసెల్ని తొలగించి, నిరుపేదల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ అక్కడి నుంచి తరిమేస్తున్నారు.
చివరకు హిజ్రాలతో కూడా దాడి చేయించారు. నిరుపేదలకు అండగా బీఆర్ఎస్, సీపీఐ నేతలు వచ్చి సంఘీభావం తెలిపారు. ఇకపై ఇలాంటి పరామర్శలు లేకుండా, ఎవరూ అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు బీఎన్ఎస్ఎస్ 164 కింద ఎనిమిది ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్టుగా రాజేంద్రనగర్ ఆర్డీవో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దానికి అనుగుణంగా శనివారం అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు.
సాధారణంగా ప్రభుత్వ భూమిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే రెవెన్యూ అధికారులు సర్కారు భూమిలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంటారు. కానీ ఇక్కడ బీఎన్ఎస్ఎస్ 164 అని పేర్కొన్నారు. ‘బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 164 భూమి లేదా నీటికి సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తుంది. శాంతికి భం గం కలిగించే భూమి లేదా భవనాలు, కట్టడాలపై ఇరు వర్గాల వాదనలు సమర్పించేంత వరకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్వాధీ నం చేసుకుంటారు.
అంటే ఇంతకీ బసవతారకనగర్ బస్తీ ఉన్నది ప్రభుత్వ భూమా? ప్రైవేటు భూమా? అధికారులు దేనిని ప్రాతిపదికగా తీసుకున్నారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ప్రకారం రెండు వర్గాల మధ్య అంటే బసవతారకనగర్ బస్తీవాసులు, అధికారులు ఎన్వోసీ ఇచ్చామంటున్న ప్రైవేటు వ్యక్తుల మధ్య గొడవ కారణంగా అధికారులు భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. పైగా 2021లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలో రికార్డుపరంగా ఈ సర్వే నంబర్లో ఎక్కడా సబ్ డివిజన్లు లేవని తేల్చి చెప్పారు.
కానీ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులో సర్వే నంబరు 37లో డివిజన్లు పేర్కొన్నారు. అంటే దీని ప్రకారం ఇప్పటికే రెవెన్యూ రికార్డుల్లో ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఎక్కాయా? అనే సందేహాలూ వినిపిస్తున్నాయి. ఇటీవల శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి ఇప్పటికే 30 ఎకరాలకు ఎన్వోసీ ఇచ్చామని చెప్పా రు. ఆ వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చినట్టయింది. ఈ నేపథ్యంలో తెర వెనక ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పి 90 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల ద్వారా కైవసం చేసుకునేందుకు రంగం పూర్తి చేశారనేది స్పష్టమవుతుంది.