హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ప్రజల నుంచి మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ చట్టవిరుద్ధంగా డిపాజిట్లను సేకరించిందని హైకోర్టులో ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. తమ సంస్థపై 2008లో నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి అధినేత రామోజీరావు, ఫైనాన్సియర్లు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో మార్గదర్శిపై విచారణను నిలిపివేస్తున్నట్టు ఉమ్మడి హైకోర్టు ప్రకటించింది.
దీన్ని సవాల్ చేస్తూ ఉండవల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఉమ్మడి హైకోర్టు తీర్పును రద్దు చేసింది. ఈ కేసు విచారణ పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్బీఐ తరఫున సుభేందు దాస్ కౌంటర్ దాఖలు చేశారు. హిందూ అవిభాజ్య కుటుంబం పేరుతో చిట్ ఫండ్ కంపెనీని నెలకొల్పి, డిపాజిట్లు సేకరించడం చట్టవ్యతిరేకమని ఆ కౌంటర్లో పేరొన్నారు. ఆర్బీఐ చట్టంలోని 45ఎస్(1), 45ఎస్(2) సెక్షన్లకు విరుద్ధంగా మార్గదర్శి సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందని తప్పుపడుతూ.. రామోజీరావు తదితరుల పిటిషన్లను కొట్టివేయాలని కోరింది.