హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై ఇటీవల రిజర్వుబ్యాంక్ విడుదల చేసిన నివేదికలో ఆయా రాష్ట్రాల బడ్జెట్లో పొందుపర్చిన అంశాలనే యథావిధిగా ముద్రించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అందులో కొత్త అంశాలేవీ లేవని ఆయన చెప్పారు. గురువారం శాసనసభలో రు ణాలపై భట్టి స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. రాష్ట్ర ఆదాయం, అప్పుల వివరాలను వెల్లడించారు. రూ.7,11, 911 కోట్ల అప్పులు ఉన్నాయని, రుణాలకు వడ్డీలు చెల్లించుకుంటూనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. రూ.40,143 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని, దశల వారీగా వాటిని చెల్లిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు రూ.43,317 కోట్ల అప్పులు చెల్లించామని చెప్పారు.