హైదరాబాద్, జూన్ 22(నమస్తే తెలంగాణ): మంత్రి కోమటిరెడ్డికి ఆర్అండ్బీ అధికారులు షాక్ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే పనులు ముందుకు సాగే అవకాశమున్నదని తేల్చిచెప్పారు. కాంట్రాక్టర్లకు ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నామని స్పష్టంచేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం సచివాలయంలో ఆర్అండ్బీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీ తిరుమల, చీఫ్ ఇంజినీర్లు మోహన్ నాయక్, రాజేశ్వర్‌రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆర్అండ్బీ శాఖ పరిధిలో పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. అధికారులు జోక్యం చేసుకొని పెండింగ్ బిల్లుల అంశాన్ని మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో అవాక్కయిన మంత్రి కోమటిరెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమారతో మాట్లాడి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. కనీసం పనులు తుది దశకు చేరుకున్న వరంగల్, ములుగు జిల్లా కలెక్టరేట్లనైనా వెంటనే పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.
పెండింగ్‌లో ఉన్న ఐదు కలెక్టరేట్లకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ. 100 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. ఒక్కో కలెక్టరేట్‌ను రూ. 50 కోట్లకుపైగా అంచనాతో చేపట్టగా, ములుగు, వరంగల్ భవనాలకు బీఆర్ఎస్ హయాంలోనే పనులు చాలావరకు జరిగాయి. ఇవి తుదిదశకు చేరినప్పటికీ బిల్లుల పెండింగ్ కారణంగా కాంట్రాక్టర్లు ఫినిషింగ్ పనులు చేపట్టకుండా నిలిపివేశారు. ప్రభుత్వం పదేపదే నిధులు లేవని చెప్తుండడంతో బిల్లులు వస్తాయో, రావో అనే అనుమానంతో కాంట్రాక్టర్లు పనులు చేయడంలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం రూ. 1,500 కోట్ల వ్యయంతో 30 జిల్లాలకు కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టగా 25 జిల్లాల భవనాలు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. ఆదిలాబాద్, వరంగల్, ములుగు, నారాయణపేట, కరీంనగర్ తదితర జిల్లాల కలెక్టరేట్ భవనాలు వివిధ కారణాలతో మధ్యలో ఆగాయి. ఇంతలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని అధికారులు చెప్తున్నారు.