హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఎల్బీనగర్లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) నిర్మాణంపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవగాహన లేకుం డా మాట్లాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టిమ్స్‌ను కేసీఆర్ ప్రభుత్వం 27 అంతస్తుల్లో నిర్మించేందుకు అనుమతి ఇచ్చిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
తాము దీనిని 14 అంతస్తులకు కుదించి నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, వైద్య నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు జీ+14 పద్ధతిలో టిమ్స్ నిర్మించేందుకే కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని స్పష్టంచేశారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలపై భారం తగ్గించే లక్ష్యంతో ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్‌లో టిమ్స్ నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. మూడు భవనాలు జీ+14 పద్ధతిలో, ఒక్కోటి దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో నిర్మాణం ప్రారంభించిన విషయం తెలిసిందే.