శ్రీశైలం ఎడారి కాబోతున్నది. ఏపీ కుట్రలకు తోడు తెలంగాణ సర్కారు మౌనం వల్ల శ్రీశైలంలో చుక్కనీరు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తున్నది.
ఏకంగా రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసేలా భారీ నిర్మాణం చేపడుతున్నారు. ఇదే గనుక జరిగితే తెలంగాణలో కృష్ణమ్మ పరవళ్లు చరిత్రలో చదువుకునే ఓ పాఠంగా మాత్రమే మిగులుతాయి.
Rayalaseema Project | మహబూబ్‌నగర్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో ఏపీ ప్రభుత్వం భారీ జలదోపిడీకి సిద్ధమయ్యింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టం 885 అడుగులు కాగా.. 854 అడుగుల వద్ద వరకు మాత్రమే నీటిని తీసుకునే అవకాశం ఉన్నది. ఏపీ ప్రభుత్వం ఏకంగా 800 అడుగుల డెడ్ స్టోరేజీ వరకు నీటిని తోడేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నది. దీనికోసం ఏకంగా 111 టీఎంసీలను తరలించేందుకు 18 కిలోమీటర్లు కృష్ణానదిలో అప్రోచ్ కెనాల్ తవ్వి భారీ ఎత్తున జలదోపిడీకి పాల్పడుతున్నది. ఎన్జీటీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎత్తిపోతల నిర్మాణం దాదాపుగా పూర్తి చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయిలో ప్రారంభమైతే శ్రీశైలం జలాశయంలో ఎండాకాలంలో డెడ్ స్టోరేజీలో కూడా నీరు కనిపించని పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ఏపీ చేపడుతున్న భారీ కాల్వ నిర్మాణమే సాక్ష్యం అని అంటున్నారు. గ్రావిటీ ద్వారా అప్రోచ్ కెనాల్ తవ్వి 12 సొరంగాల ద్వారా పంప్‌హౌస్‌కు నీటిని తరలించి.. అక్కడి నుంచి రాయలసీమకు తరలిస్తారు.
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు ఎక్కువ భా గంలో ఉండడంతో ఏపీకి కలిసివచ్చింది. కే వలం కాల్వ తవ్వితే చాలు గ్రావిటీ ద్వారా నీ టిని తరలించుకుపోవచ్చు. తెలంగాణ వైపు నీటిని మళ్లించాలంటే ఎత్తిపోతలే శరణ్యం. కృష్ణా ప్రాజెక్టులను పరుగులు పెట్టించాల్సిన కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉండి మౌ నంగా ఉండటంపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమం త్రి, మంత్రులుగా ఉన్నవారు జలదోపిడీపై మౌనం వీడాలి. బేషజాలకు పోకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరందించాలి.కేసీఆర్ హయాంలో తెలంగాణలో ప్రతి బీడు పొలానికి సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కృష్ణా నదిలో తెలంగాణ రావాల్సిన నీటి వాటాను పక్క రాష్ర్టానికి అప్పజెప్పినట్లుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకపోతే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది.