హైదరాబాద్, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): సన్నధాన్యంలో బియ్యం అవుట్ టర్న్ రేషియోను తేల్చాలని రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అవుట్ టర్న్ తేల్చకుండా ముందుకెళ్తే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. సోమవారం హైదరాబాద్ నగర శివారులో గణపతిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు.
వానకాలం ధాన్యంలో అవుట్‌టర్న్ రేషియోను తేల్చిన తర్వాతే ధాన్యం దించాలని, ఇందుకోసం టెస్ట్ మిల్లింగ్ చేయించాలని విజ్ఞప్తి చేశారు. టెస్ట్ మిల్లింగ్‌లో ఎంత శాతం బియ్యం వస్తే అంత ఇస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే వానకాలం ధాన్యం దించుకోబోమని మిల్లర్లు కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చారు. రా రైస్ మిల్లర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు.