హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు అరిగోస పడుతుంటే.. ఆ కొరతకు కారణం బీఆర్ఎస్సే అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారని, ఈ విషయంలో ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్ సర్కార్ హయాంలో లేని కొరత.. ఇప్పుడెందుకు వచ్చింది. రైతులకు యూరియా అందించలేని ప్రభుత్వాన్ని దద్దమ్మ అని కాకుండా ఇంకేమి అంటారు. యూరియాపై ముందస్తు ప్రణాళికలు లేకుండా చేతులు ముడుచుకుని కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వానిది చేతకాని తనం కాదా?. యూరియా కోసం కేసీఆర్ హయాంలో రైతుల క్యూలైన్లు ఎప్పుడైనా చూశారా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. కృత్రిమ కొరత అంటున్నారు కదా.. మంత్రులు పొన్నం, పొంగులేటి యూరియా పంపిణీ కేంద్రాలకు వచ్చి చూడాలని రావుల సవాల్ విసిరారు.
రాష్ట్రంలో యూరియా కొరతకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం థర్డ్‌గ్రేడ్ ప్రభుత్వం కాదా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? అని రావుల శ్రీధర్‌రెడ్డి నిలదీశారు. మంత్రి పొన్నం.. కేటీఆర్‌ది డర్టీ మైండ్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వాస్తవంగా చెప్పాలంటే.. రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులది అసలైన డరీ ్టమైండ్ అని నిప్పులు చెరిగారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఇంగితం ప్రదర్శించాలని మంత్రి పొన్నంకు హితవు పలికారు.
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సరిపడా యూరియా లేదంటూ మంత్రుల ప్రచారంతోనే కృత్రిమ కొరత ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కొరత ఉందనే కారణంతో అక్రమంగా స్టోర్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 11 ఏండ్లలో ఏనాడూ యూరియా కొరత లేదని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రంలో యూరియా నిల్వలు ఏమయ్యాయో తెలియడం లేదని అనుమానం వ్యక్తంచేశారు.