ఆదిలాబాద్ : తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగపూట ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని బతుకమ్మ చీరల పంపిణీకి(Bathukamma sarees) శ్రీకారం చుట్టింది. ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తూ వస్తున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలన గాడి తప్పింది. తాజాగా ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో బతుకమ్మ చీరలు ఎలుకల పాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. తలమడుగు మండలానికి దీపావళి పండుగ ముందు 11,800 బతుకమ్మ చీరలు వచ్చాయి. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒకటి చొప్పున 18 సంవత్సరాలు నిండిన ఆదివాసీ మహిళలకు రెండు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా అధికారులు పట్టించు కోకపోవడంతో చీరలు ఎలుకల పాలు కావడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి చీరలను త్వరగా పంపిణీ చేయాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.