కవాడిగూడ, ఆగస్టు 22: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు కనీస గౌరవ వేతనం ఇవ్వాలని, కమీషన్ పెంచాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద రేషన్ డీలర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల రమేశ్‌బాబు మాట్లాడుతూ.. ఏ నెల కమీషన్ ఆ నెలలోనే చెల్లించాలని, గౌరవ వేతనం ఐదు వేలు పెంచాలని, ఐదు నెలల బియ్యం కమీషన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించాలని కోరారు. బియ్యం దిగుమతి చార్జీలను, రేషన్ దుకాణాల అద్దెను ప్రభుత్వమే భరించాలని పేర్కొన్నారు. పదేండ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. రేషన్ డీలర్లలో ఉన్నత విద్యావంతులకు శాఖాపరమైన పదోన్నతులు కల్పించి, వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కరోనాతో మరణించిన రేషన్ డీలర్ల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
రేషన్ డీలర్ చనిపోతే దహన సంస్కారాల కోసం రూ. 30 వేలు చెల్లించాలని కోరారు. హైదరాబాద్ నగరంలో రేషన్ భవన్ నిర్మాణానికి వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హనుమాండ్లు, వర్కింగ్ ప్రసిడెంట్ లక్ష్మీనారాయణ, కోశాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి దరావత్ మోహన్‌నాయక్, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.