SLBC Tunnel | మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో నాలుగు రోజు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. 10 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం కనిపించడం లేదు. మంగళవారం ర్యాట్ మైనర్ టీంను రంగంలోకి దింపారు. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత పోలీసు జాబిలాలను లోపలికి పంపారు. ఉదయం 10 గంటలకు లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్ళారు. ఈ రిస్క్ ఆపరేషన్ను రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట నీటి ఊట మరింత పెరిగిందని ఉన్న అధికారులు తెలిపారు. ఎనిమిది మంది మైనర్లు చిక్కుకున్న ప్రదేశంలో సుమారు ఐదు మీటర్ల బురద ఉందని అంచనా వేశారు. సొరంగంలోపల విద్యుత్ పునరుద్ధరించే అవకాశాలు కనిపించడం లేదు. అయితే, సహాయ బృందాలు టార్చి లైట్ల సాయంతో లోపలికి జనరేటర్ లోపలికి తీసుకువెళ్లారు. ప్రమాదం జరిగిన చోటును గుర్తించి అక్కడ శిథిలాల తొలగింపు పూర్తయితే తప్ప పరిస్థితి ఏంటి అనేది అంచనా వేయలేమని రెస్క్యూ ఆపరేషన్ బృందం సభ్యులు చెబుతున్నారు.
ఎస్ఎల్బీసీ ప్రమాద సంఘటనా స్థలాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావులతోపాటు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ మంగళవారం పరిశీలించారు. స్వయంగా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం ప్రాజెక్ట్ స్థలంలోని జేపి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సహాయ కార్యక్రమాల తీరును సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరాఫ్ అలీ, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఐజీ చౌహన్, ఎల్ అండ్ టీ టన్నెల్ రంగ నిపుణులు క్రిస్ కూపర్, రాబిన్స్ కంపెనీ ప్రతినిధి గ్రేన్ మేకర్డ్, ఉత్తరాఖండ్లో ఇలాంటి దుర్గటనలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన నిపుణుల బృందం, ఆర్మీ, ఎంఓఆర్టీహెచ్, ఎన్హెచ్ఐడీసీఎల్,ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్, ఎస్సీసీఎల్, ఉత్తర కాశీ టన్నెల్ రెస్క్యూ ర్యాట్ మైనర్స్ గ్రూప్ ప్రతినిధి ఫిరోజ్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.