మానకొండూర్ రూరల్, జనవరి 5: ఆరో గ్యారంటీ(Six Guarantee) అయిన రైతు బంధు కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందేనని మానకొండూర్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్(Rasamayi Balakishan) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో పల్లెమీద చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో రైతు భరోసాకు రూ.15 వేలు ఇవ్వాలని రైతుల తరపున నిరసన, ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి మాట, ప్రతి హామీని విస్మరిస్తున్నారని, కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని మళ్లీ మళ్లీ నిరూపించుకున్నదని మండిపడ్డారు. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.12 వేలు మాత్రమే ఇస్తామంటూ మాట మార్చడం సరికాదన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, శంకరపట్నం మండల అధ్యక్షుడు గంట మహిపాల్, తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, నియోజక వర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.